అలుపెరుగని అమరావతి ఉద్యమం

అలుపెరుగని అమరావతి ఉద్యమం
- – 23 వ రోజు ఉప్పెనలా సాగుతున్నా మహా పాదయాత్ర…
- – మహా పాదయాత్రకు భారీ స్పందన..ప్రభంజనంలా జన సందోహం
కావలి, నవంబర్ 23 (సదా మీకోసం) :
నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి పాదయాత్ర ప్రారంభమైంది. జై అమరావతి… జయహో అమరావతి…ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అమరావతిని నిలుపుకుందాం.. అంటూ నినాదాలు మార్మోగాయి.
కావలి నియోజకవర్గ ప్రజానీకం అన్నదాతలకు దారిపొడవునా బ్రహ్మరథం పట్టారు. ఊరూరా అమరావతి నినాదం మార్మోగుతున్న వేళ న్యాయస్థానం నుండి దేవ స్థానం పేరుతో మహా పాదయాత్ర నిర్వహిస్తున్న రైతులకు ప్రజలు నిరాజనాలు పలికారు.
అమరావతి రైతులకు తోడు అమరావతి నుండి కావలి వరకు ఉన్న రైతులు తమ మద్దతు తెలుపుతుండడంతో అప్రతిహాతంగా మహా పాదయాత్ర జరుగుతుంది.
అడగడుగునా ఆంక్షలతో వేధిస్తున్నా అదరక, బెదరక అంతిమ లక్ష్య సాధన దిశగా రైతులు అడుగులేస్తున్నారు. మహా పాదయాత్రకు స్థానిక నాయకులు మద్దతు తెలుపుతుండడంతో ప్రజలు వారికి హరతులచ్చి స్వాగతం పలుకుతున్నారు.