రూరల్ లో తెలుగుదేశం పరిస్థితి ఏంటి..?
రూరల్ లో తెలుగుదేశం పరిస్థితి ఏంటి..?
బాదుడే బాదుడు, ఆత్మగౌరవం నిర్వహించడంలో విఫలం
సలహాలు స్వీకరించరు, నాయకుల మాట వినరు
పరిస్థితి ఇలానే ఉంటే రూరల్ సీటు వదులుకోవాల్సిందేనా
రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగత విమర్శలంటున్న అధికార పార్టీ
నెల్లూరు ప్రతినిధి జూలై 11 (సదా మీకోసం) :
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీని ఢీకొట్టడంలో తెలుగుదేశం పార్టీ వెనకబడిపోతుందనే విమర్శలున్నాయి.
వైఎస్సార్ సిపిలో అబ్దుల్ అజీజ్ మేయర్‌గా గెలవగా అనంతర పరిణామాలతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్‌గా ఉన్న అబ్దుల్ అజీజ్ చివరి నిమిషంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జిగా, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
ఆనాటి పోరాట పటిమ ఏమైంది
అధ్యక్షులుగా ఎన్నికైన తొలినాళ్లలో పార్టీ అభివృద్దికి కృషి చేసినా, అనంతరం ఆయన వ్యవహారశైలితో పార్టీకి పెద్ద దిక్కులేకుండా పోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పదవి పొందిన తొలినాళ్లలో ఉన్న ఆ పోరాట పటిమ ఇప్పుడు ఎక్కడకు వెళ్లందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ఒక పార్టీ అధ్యక్షలుగా ఉన్న ఆయన, పార్టీ కార్యాలయంలో కన్నా తన ఇంటిలోని తన కార్యాలయం నుండే కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం.
ఇదే విషయమై గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మందలించినా ఇప్పటికి మార్పురాలేదని కార్యకర్తలు వాపోతున్నారు.
జిల్లా కార్యాలయంకి పార్టీ అధ్యక్షడు అబ్దుల్ అజీజ్ రావడం లేదని, ఆయన రాకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
సమస్యలు చెప్పుకునేందుకు అధ్యక్షుడు అజీజ్ కార్యాలయంలో లేకపోవడంతో కార్యకర్తలు కూడా కార్యాలయంకి రాకపోవడం గమనార్హం.
దీంతో జిల్లా కార్యాలయం బోసిపోయి కనిపించడంతో కార్యకర్తల్లో ఉత్సాహం కనుమరుగౌతుంది.
ప్రజల్లోకి వెళ్లడంలో విఫలం
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటి ఇచ్చిన పిలుపులైన బాదుడే బాదుడు, ఆత్మగౌరవం కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారన్న విమర్శలన్నాయి.
రూరల్‌లో కార్యకర్తలు ఉన్నా వారిని గుర్తించడంలో, ఉపయోగించుకోవడంలో అబ్ధుల్ అజీజ్ వెనకబడ్డారని పరిశీలకులు భావిస్తున్నారు.
నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఇప్పటికే ఒకటికి రెండు సార్లు నియోజకవర్గం మొత్తం తిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటుంటే, ప్రతి పక్ష పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఇప్పటికి ఒక్క సారికూడా నియోజకవర్గాన్ని కలియదిరిగకపోవడం గమనార్హం.
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను, తమ పార్టీ వైపు ప్రజలను మలచుకునేందుకు ఉపయోగించుకోగా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం అబ్దుల్ అజీజ్ ప్రజల్లోకి వెళ్లడంలో, ప్రజల మద్దతు పొందడంలో పూర్తిగా విఫలమైందన్న విమర్శలున్నాయి.
దీనికి కారణం నియోజకవర్గ ఇంచార్జ్ ఒంటెత్తు పోకడలేనని నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారు.
సలహాలు స్వీకరించలేని ఇంచార్జ్
నెల్లూరు జల్లా అధ్యక్షలుగా, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న అబ్దుల్ అజీజ్ తన కంటే ఎవరూ ఎక్కువ కాదు.
నాకే అన్నీ తెలుసు అన్న దోరణిలో తనకు ఇచ్చే సలహాలను కూడా స్వీకరించలేని స్థితిలో ఉన్నారని రూరల్ నియోజకవర్గంలోని ధ్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు.
ఇచ్చే సలహాలు స్వీకరించకపోయినా పర్లేదని, తిరిగి తమనే వ్యంగ్యంగా మాట్లాడుతున్నారిని బాదపడడం కూడా ఆయనకు కనిపించడంలేదన్న విమర్శలున్నాయి.
ఏ నాయకుడైన కార్యకర్తలు చెప్పేమాటలు విని, ఏవిధంగా ముందుకు పోతే పార్టీని విజయతీరాలకు తీసుకు పోగలం అని ఆలోచించి, ఆ విధంగా నిర్ణయం తీసుకుని, దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకుంటారు.
కాని ఇక్కడ తాము చెప్పే మాట వినే వారేలేరని కార్యకర్తలు వాపోతున్నారు.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అన్న విషయం అబ్దుల్ అజీజ్‌కు ఎప్పుడు అర్ధం అవుతుందో అని తెలుగుదేశం పార్టీ అభిమానులు గుసగుసలాడుతున్నారు.
వ్యక్తి గత విమర్శలతో పార్టీకి చెడ్డ పేరు
తన రాజకీయ ప్రత్యర్ధి అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని విమర్శించడంలో హద్దులు దాటతుండడంతో తన రాజకీయ ప్రత్యర్ధికే ఉపయోగం ఉంటుదన్న ఆలోచన కూడా అబ్దుల్ అజీజ్‌కు రావడంలేదా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయాలలో ప్రత్యర్ధులను విమర్శించే సమయంలో అంశాల వారీగా వారు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఆధారాలతో సహా విమర్శించడం వేరు.
రాజకీయ ప్రత్యర్ధులను పర్సనల్ గా విమర్శించడం వేరు అన్న విషయం కూడా అబ్దుల్ అజీజ్‌కు తెలియదా అని ఆశ్చర్యపోతున్నారు.
చెప్తే వినరు, చాదస్తం ఎక్కువ అన్న చందంగా ఏవరైన సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితుల్లో ఆయన లేడన్న విమర్శలు ఉన్నాయి.
రాజకీయ ప్రత్యర్ధిపై రాజకీయ విమర్శలు మాని వ్యక్తిగత విమర్శలతో చెడ్డపేరు తెచ్చుకుంటున్నారని, రాజకీయ విమర్శలను సాక్షాలతో సహా నిరూపించలేకే ఇలా వ్యక్తిగత విమర్శలకు పోతున్నారని ప్రత్యర్ధి వర్గాలవారు అంటున్నారు.
పరిస్థితి ఇలానే ఉంటే రూరల్ సీటు వదులుకోవాల్సి వస్తుందని కార్యకర్తలు వాపోతున్నారు.
ఇప్పటికైనా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్రలు కలగజేసుకొని రూరల్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.