వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి : మంత్రి కాకాణి

వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు ప్రతినిధి, జూలై 24 (సదా మీకోసం) :
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారని, అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించారని, అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా, మన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా నూతన వ్యవస్థలను పరిచయం చేసి, వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆదివారం ఉదయం నెల్లూరు శ్రీ వెంకటేశ్వర కస్తూర్భా కళాక్షేత్రంలో సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసిన సందర్భంగా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపే ఆత్మీయ అభినందన సభ (థాంక్యూ సీఎం సార్) కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగంలో చేరి ఒక స్థాయి, గౌరవం వచ్చిన తర్వాత, మనకు ఏ వ్యక్తి అయితే ఉద్యోగ భద్రత కల్పించారో, మనకు అండగా నిలిచి మన కుటుంబాల్లో వెలుగులు నింపారో అటువంటి ముఖ్యమంత్రిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని, ఆయనకు కృతజ్ఞతలు తెలపాలనే మంచి సంకల్పంతో ఆత్మీయ అభినందన సభ ద్వారా ధన్యవాదాలు తెలిపేందుకు నిర్ణయించుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అందరిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
2019 ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెబితే, చాలామంది ఇది సాధ్యమేనా, లక్ష ఉద్యోగాలు భర్తీ చేయడం అసలు సాధ్యపడుతుందా, కాగితాలకే పరిమితం అని వెటకారంగా మాట్లాడారని, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత నోటిఫికేషన్ ఇస్తే, ఈ ఉద్యోగాలన్నీ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులతో భర్తీ చేస్తారని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని చెప్పారు.
వీటన్నిటినీ పక్కనపెట్టి కేవలం అర్హత, ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా, పక్షపాత వైఖరి లేకుండా ఒక పకడ్బందీ వ్యవస్థను రూపొందించి సరికొత్త ఒరవడితో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నోటిఫికేషన్ తో ఒక లక్షా 34 వేల ఉద్యోగాలను భర్తీ చేసి చరిత్ర సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు.
కరోనా సమయంలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివన్నారు. నిఘా వ్యవస్థకు కూడా కనబడకుండా గ్రామాలకు వచ్చిన కొత్తవారిని గుర్తించి, వారి వివరాలను సేకరించి అధికారులకు తెలిపి, వారికి వైద్య పరీక్షలు చేయించి, అప్రమత్తంగా వ్యవహరించి కరోనాను కట్టడి చేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారన్నారు.
కరోనాతో ఆర్థికంగా చితికిపోయి, ఉద్యోగాలు కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు కల్పించి, వారికి అండగా నిలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.
జిల్లాలో 6688 సచివాలయ ఉద్యోగులకు గాను 5468 మంది ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసి పర్మినెంట్ చేయగా, కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలు అందుతాయని, మిగిలి ఉన్న కొంత మందికి కూడా త్వరలోనే సాంకేతికపరమైన ప్రక్రియ పూర్తి చేసి కొత్త జీతాలు అందించనున్నట్లు చెప్పారు.
సచివాలయ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, ముఖ్యమంత్రి మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని అంకితభావంతో విధులను నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు.
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యవస్థలో పనిచేసే వారిలో ఎక్కువమంది ఉన్నత విద్యావంతులు ఉండడం ఈ సచివాలయ వ్యవస్థ గొప్పతనమని, అందువల్లనే ప్రభుత్వం అందించే ఆదేశాలు చక్కగా పాటిస్తూ, అనేక సంక్షేమ పథకాలను ఎక్కడా లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా ప్రజలకు చేరవేస్తున్నారని, ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ముఖ్యమంత్రికి రెండు కళ్ళు లాంటివన్నారు. సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా శ్రద్ధాసక్తులతో తమ విధులు నిర్వర్తించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
సభ ప్రారంభానికి ముందు చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం సచివాలయ ఉద్యోగులు తమ అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగంతో చేసిన ప్రసంగాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, గ్రామ, వార్డు సచివాలయాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ హరీష్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ సిహెచ్ వెంకటేష్, జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షులు సందీప్, జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి, డిఆర్డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారెడ్డి, నుడా వైస్ చైర్మన్ ఓబులేసు నందన్, జిల్లా స్థాయి అధికారులు, జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.