రేపు సత్యసాయి, కడప జిల్లాలకు సీఎం చంద్రబాబు
శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరు
కడప జిల్లా నుంచి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల
అన్నదాత సుఖీభవ రెండో విడతలో 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్ల జమ
అమరావతి, నవంబరు 18: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు.
హైదరాబాద్ నుంచి నేరుగా ఇవాళ సాయంత్రం పుట్టపర్తికి చేరుకోనున్న సీఎం ఈ రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
రేపు ఉదయం 9.25 నిముషాలకు పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన స్వాగతం పలకనున్నారు.
అక్కడి నుంచి ప్రధాని మోదీతో కలిసి శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.
10 గంటలకు సాయి కుల్వంత్ హాల్లో భగవాన్ శ్రీసత్యసాయి మహా సమాధిని ఇరువురు నేతలు దర్శించుకోనున్నారు.
అనంతరం శ్రీసత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించే శతజయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు హాజరు అవుతారు.
ప్రధాని మోదీకి వీడ్కోలు పలికిన అనంతరం 1.15 గంటలకు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రికి సీఎం చేరుకోనున్నారు.
స్థానికంగా గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి అనంతరం రైతులతో సీఎం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు.
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం రెండవ విడతలో రూ.7 వేల చొప్పున 46,85,838 మంది రైతుల ఖాతాలకు రూ.3,135 కోట్లను జమ చేయనుంది.
ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా రూ.7 వేలను ప్రభుత్వం జమ చేసింది. రేపు రెండో విడతగా మరో రూ.7 వేల చొప్పున రైతులకు ప్రభుత్వం జమ చేయనుంది.
రెండు విడతల్లో మొత్తంగా రూ.6,309.44 కోట్ల మేర ఆర్ధిక ప్రయోజనం రైతులకు కలుగుతోంది.
ఈ కార్యక్రమం అనంతరం స్థానిక కేడర్ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం రేపు రాత్రికి అమరావతికి రానున్నారు.

