పెరుగుతున్న ప్రేగు సంబంధిత వ్యాధులు
మెడికవర్ లో అత్యాధునిక వైద్య చికిత్సలు

లక్షణాలను బట్టి మందులు వాడితే సమస్య నుండి బయటపడవచ్చు
ప్రేగు సమస్యల్లో మలబద్దకం కూడా ఒకటి
నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కె. శ్రీధర్ రెడ్డి
నెల్లూరు వైద్యం, జూన్ 03 (సదా మీకోసం) :
మన జీర్ణ వ్యవస్థలో ప్రేగులు (చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు) ఆహారాన్ని జీర్ణం చేయడంలో, పోషకాలను శరీరానికి అందించడంలో, వ్యర్ధాలను బయటకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తాయని అలాంటి ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుకుంటేనే జీవన గమనం సజావుగా ముందుకు సాగుతుందని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కె. శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇటీవల కాలంలో ప్రేగు సంబంధిత సమస్యలతో అనేక మంది హాస్పిటల్ కు వస్తున్న తరుణంలో ప్రేగు వ్యాధులు రావడానికి గల కారణాలు, వాటి లక్షణాలు, చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డాక్టర్ శ్రీధర్ రెడ్డి ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి
ప్రేగు సంబంధిత సమస్యలు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని, రోజు వారీ జీవితం కూడా సజావుగా సాగదని అన్నారు. ప్రేగు సంబంధిత వ్యాధులకు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, అనుభవజ్ఞులైన వైద్య బృందం కూడా ఉందని తెలియజేశారు.
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్
సాధారణంగా ప్రేగు సంబంధిత సమస్యలు ఏడు రకాలుగా ఉంటాయని డాక్టర్ కే. శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబిఎస్) అని పిలిచే ప్రేగు సంబంధ సమస్యకు పొత్తి కడుపులో నొప్పి, తిమ్మిర్లు, ఉబ్బరం, విరేచనాలు, మలబద్దకం లాంటి లక్షణాలను కలిగి ఉంటుందని చెప్పారు. అధిక ఒత్తిడి, కొన్ని ఆహార పదార్ధాలు తీసుకోవడం, పేగులోని సూక్ష్మజీవులలో అసమతుల్యత కారణంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్య వస్తుందన్నారు. ఆహార నియంత్రణ, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, ఒత్తిడి లేకుండా జీవించడం, లక్షణాలను బట్టి మందులు వాడితే ఈ సమస్య నుండి బయటపడవచ్చునని చెప్పారు. ప్రేగు సమస్యల్లో మలబద్దకం కూడా ఒకటని, తక్కువ ఫైబర్ ఆహారం తీసుకోవడం, తక్కువ నీరు తాగడం, శారీరక శ్రమ లేకపోవడంతో మల బద్దక సమస్య వస్తుందని వైద్యులు తెలిపారు. ఫైబర్ అధికంగా ఉంటే ఆహారం తీసుకోవడం, పుష్కలంగా నీరు త్రాగడం, వ్యాయామం చేయడం, సమస్యను బట్టి మందులు వాడితే మల బద్దకం సమస్య నుండి బయటపడవచ్చునని డాక్టర్ శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.
ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్
తరచుగా నీళ్ల విరేచనాలు అవ్వడం కూడా ప్రేగు సంబంధిత సమస్యల్లో భాగమన్నారు. బ్యాక్టీరియా, వైరస్ ఇన్ ఫెక్షన్లు, ఆహార అలెర్జీలు, జీర్ణాశయాంతర వ్యాధుల కారణంగా నీళ్ల విరేచనాలు అవుతాయని, ద్రవ రూపంలో ఆహారం తీసుకుంటూ యాంటీ బయాటిక్స్ ఇతర మందులు వాడితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయన్నారు. ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబిడి) ఇది కూడా ప్రేగు వ్యాధుల్లో పెద్ద సమస్యకు దారి తీస్తుందని కొన్ని సందర్భాల్లో ఈ సమస్యకు శస్త్ర చికిత్స కూడా చేయాల్సి ఉంటుందని డాక్టర్ శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. ఈ వ్యాధి కారణంగా ప్రేగులు వాపునకు గురౌతాయని, అలాగే క్రోన్ స్ వ్యాధి కూడా ప్రమాదకరమైందని ఇది జీర్ణ వ్యవస్థలో ఏ భాగాన్నైనా ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అల్సరేటివ్ కొలైటిస్ అనే మరో సమస్య మూలంగా పెద్ద ప్రేగు, పురీషనాళం ప్రభావితమవుతాయని పేర్కొన్నారు. రోగ నిరోధక వ్యవస్థలో లోపారు, జన్యుపరమైన అంశాలు, పర్యావరణ కారకాల కారణంగా ఈ సమస్యలు వస్తాయన్నారు. తీవ్రమైన కడుపు నొప్పి, రక్తంతో కూడిన విరేచనాలు, బరువు తగ్గడం, అలసట లాంటి లక్షణాలను ఈ వ్యాధులకు లక్షణాలుగా చెప్పుకోవచ్చునని వెల్లడించారు. వాపును తగ్గించే మందులు వాడటం, జీవన శైలిలో మార్పుల ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చునని కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని డాక్టర్ శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.
పురీషనాళంలో క్యాన్సర్ కణాలు పెరుగుతాయి
డైవర్టికులైటిస్ అనే సమస్య ద్వారా పెద్ద ప్రేగు గోడలలో బుడగలు ఏర్పడతాయని, ఒక్కో సారి ప్రేగు వాపునకు కూడా గురౌతుందన్నారు. కొలన్ క్యాన్సర్ అనే సమస్య జఠిలమని, ఇది సోకితే పెద్ద ప్రేగు, పురీషనాళంలో క్యాన్సర్ కణాలు పెరుగుతాయని చెప్పారు. ఈ సమస్యకు శస్త్ర చికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రేగు సంబంధిత సమస్యలను నిర్ధారించడానికి వైద్యులు లక్షణాలను బట్టి పరీక్షలు నిర్వహిస్తారని, రక్త పరీక్షలు, మల పరీక్షలు, కొలనోస్కోపీ, ఎండో స్కోపీ, సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుందన్నారు. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం ప్రేగు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటూ నిర్ధిష్టమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని, అనుభవజ్ఞులైన వైద్య బృందం ప్రేగు సమస్యలు రాకుండా జీవన శైలి సలహాలను అందిస్తుందని చెప్పారు. అలాగే మెడికవర్ లో అత్యాధునిక వైద్య సౌకర్యాలు, పరికరాలు అందుబాటులో ఉన్నాయని, రోగిని సంపూర్ణ ఆరోగ్యం వంతునిగా మార్చడానికి తాను కట్టుబడి ఉన్నామని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కే. శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.


