పిచ్చికుక్క కరిస్తే వ్యాక్సిన్ తప్పనిసరి…!

పిచ్చికుక్క కరిస్తే వ్యాక్సిన్ తప్పనిసరి…!
రేబీస్ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ కనుగొన్న లూయిస్ పాశ్చర్ జ్ఞాపకార్ధంగా ఆయన మరణించిన రోజైన సెప్టెంబరు 28న ప్రతి సంవత్సరం ప్రపంచ రేబీస్ దినోత్సవం జరుపుకుంటున్నాం. అతి ప్రమాదకరమైన ఈ రేబీస్ వ్యాధి వ్యాప్తిని తగ్గించడమే ఈ దినోత్సవముఖ్య ఉద్దేశం. 2017 నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నా ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 59 వేల రేబీస్ మరణాలు జరుగుతున్నాయి. ఇందులో దాదాపు 21 వేల రేబీస్ మరణాలు ఒక్క భారతదేశంలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ అధికారిక లెక్కలే. అనధికారిక లెక్కలు ఇంకెన్నో?
అంటార్కిటికా ఖండంలో తప్ప అన్ని ఖండాలలో ఈ కేసులు తర తమ స్థాయిలలో నమోదు అవుతూనే ఉన్నాయి . ఈ లెక్కల ప్రకారం చూస్తే ప్రపంచ రేబిస్ మరణాల్లో 36%మరణాలతో మనదేశమే ప్రథమ స్థానంలో ఉంది. ఈ మరణాలలోనూ దరిదాపుగా సగం మంది 15 సంవత్సరాలు లోపు వారే ఉండడం మరీ బాధాకరం. ఈ మరణాలలో 99% మన చుట్టూ తిరిగే కుక్కకాటు వల్ల సంభవించేవే. అమెరికాలో మాత్రం గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందడమే ఎక్కువ. ఎందుకంటే అక్కడ కుక్కలకు తప్పకుండా రేబీస్ వ్యాక్సిన్ వేయిస్తారు కాబట్టి. రేబీస్ వ్యాధికి ఉన్న విచిత్రమైన ప్రత్యేకత ఏమిటంటే ఇది నూటికి నూరు శాతం నివారించదగ్గ జబ్బు. అయితే వ్యాధి సోకి వ్యాధి లక్షణాలు కనిపిస్తే నూటికి నూరు శాతం మరణించాల్సిందే. ఈ వ్యాధి సోకి లక్షణాలు కనిపించి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు18 మంది మాత్రమే బ్రతికి బయటపడ్డారు. . వీరు ఎందుకు బయటపడ్డారు? ఎలా బయటపడ్డారనే విషయం ఇంతవరకు వైద్యశాస్త్రానికి తెలియదు.
రేబిస్ వ్యాధి ఎలా వస్తుంది?
రేబిస్ అంటే తెలియకపోవచ్చు కానీ కుక్క కరిస్తే పిచ్చి పడుతుందని ప్రజలో ఉన్న నానుడి. కుక్క కరిచి పిచ్చి పట్టడం అంటే రేబీస్ వ్యాధి వచ్చినట్టే. కుక్క ద్వారానే కాదు పాలిచ్చే జంతువు ఏది కరిచినా రేబీస్ వ్యాధి రావచ్చు.
ఇది క్షీరదాలకు చెందిన జంతువుల నుండి జంతువులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న కుక్కలు, నక్కలు, తోడేళ్లు, పిల్లులు, ముంగిసలు, ఉడుతలు, ఎలుకలు, ఎలుగుబంట్లు, కోతులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఆవులు, పందులు లాంటి జంతువులు కరిచినప్పుడు వాటి లాలాజలంలో ఈ వైరస్ ఉండి కరిచిన గాయం ద్వారా మనుషులకు సోకుతుంది. కుక్క గోరు గీసుకున్నా రేబీస్ వ్యాధి సోకవచ్చు. కుక్కలు తన కాళ్ళ గోళ్లను గీరుకుంటుంటాయి.పదే పదే కాలి గోర్లు, పంజాను నాలుకతో నాకుతుంటాయి. ఫలితంగా వైరస్ వాటి పంజాపై చేరుతుంది. ఆ కాళ్ళ గోళ్ళకు కుక్క నోటిలోని లాలాజలంలోని వైరస్ అంటుకొని గాయపడిన జంతువుకు రేబీస్ వైరస్ సోకవచ్చు. రేబిస్ వ్యాధి లక్షణాలు ఉంటేనే గాయపడిన జంతువుకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. మనదేశంలో దరిదాపుగా 99 శాతం కుక్క కాటు ద్వారానే వ్యాపిస్తుంది.
మానవ శరీరం లో రేబీస్ కారక వైరస్ ప్రయాణం
కుక్క కాటు ద్వారా శరీరంలోకి ప్రవేశించిన రేబీస్ కారక వైరస్ ఆ గాయం దగ్గరే అభివృద్ధి చెంది, అచ్చట నుంచి బాహ్య నాడీ వ్యవస్థ ద్వారా వెన్నుపాముకు చేరుకుని, వెన్నుపాము నుంచి మెదడుకు
చేరుకుంటుంది. నాడీ వ్యవస్థ ద్వారానే ప్రయాణం చేయడం ఈ వైరస్ కు వున్న మరొక ప్రత్యేక లక్షణం. ఈ వైరస్ రోజుకు మూడు మిల్లీమీటర్ల దూరం మాత్రమే ప్రయాణం చేయగలదని అనేక పరిశోధనలలో తేలిన విషయం. మెదడుకు చేరుకొన్న తరువాతనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి లక్షణాలు బయటపడడానికి పట్టే కాలం గాయం జరిగిన భాగంపై ఆధారపడి ఉంటుంది.మన శరీరము పై మెదడుకు ఎంత దగ్గరగా కరిస్తే అంత తొందరగా వ్యాధి మెదడుకు చేరే అవకాశముంది. తల మీద జరిగే గాయాలతో త్వరగా వ్యాధి లక్షణాలు కనిపిస్తే, కాళ్ళ మీద జరిగే గాయం ద్వారా నిదానంగా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే వ్యాధి లక్షణాలు కనిపించడానికి తొమ్మిది నుంచి 90 రోజుల సమయం పడుతుంది.
వ్యాధి లక్షణాలు
ఈ వ్యాధి తో బాధపడుచున్న జంతువు లోనూ, మనుషులలోనూ ఒకే విధమైన లక్షణాలు ఉంటాయి. జ్వరం, ఒళ్ళు నొప్పులు, గాభరాగా ఉండడం, తికమక పడడం, మితిమీరిన భయం, భయంకరమైన చూపు, తనదైన లోకములో విహరించడం, నోటి వెంబడి లాలాజలం కారడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, గొంతు నొప్పి, ఏమీ మింగలేకపోవడం, నీటిని, ద్రావకాలను చూస్తే భయపడడం (హైడ్రోఫోబియా) వెలుతురు చూడలేకపోవడం (ఫోటో ఫోబియా) గాలితోలినా సహించలేక పోవడం (ఏరోఫోబియా) ఇతరులను చూసి భయపడి కరవడం లాంటి లక్షణాలు ఉంటాయి . ఈ లక్షణాలు ముదిరి, గొంతు కండరాలు పక్షవాతానికి గురై ఏమీ తినలేక, తాగలేక అపస్మారక స్థితికి వెళ్లి చనిపోతారు. ప్రత్యేకమైన వైద్యం ఏమీ లేని కారణంగా జబ్బు లక్షణాలు కనిపించిన 10 రోజులలో చనిపోతారు.
కుక్క కాటును తప్పించుకోవడం ఎలా?
1. మనకు పరిచయం లేని కుక్కల జోలికి వీలైనంతవరకు పోకూడదు. పరిచయం లేని కుక్క మనల్ని కరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.
2. నిద్రపోతున్న, ఆహారం తింటున్న, పిల్లలకు పాలిస్తున్న కుక్కల దగ్గరికి పోకూడదు.. వాటిని తాకకూడదు. ఆ పరిస్థితులలో కుక్కకు చిన్న అసౌకర్యం కలిగినా కోపం ఎక్కువగా వచ్చి కరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3. కుక్క కళ్ళల్లోకి నేరుగా చూడకూడదు. మనకు తెలియని కుక్క దగ్గరికి పోకపోవడం చాలా మంచిది. అనివార్యమై కుక్క మన దగ్గరికి వచ్చినా.. మనం దాని దగ్గరకు వెళ్లవలసి వచ్చినా… కుక్క మన వైపు చూసినప్పటికీ, మనం దాని కళ్ళలోకి చూడకూడదు. అలా చూస్తే మనమేదో దానికి హాని చేయబోతున్నామని కరిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
4. మనల్ని కరవడానికి కుక్క తరుంతుంటే ఎట్టి పరిస్థి తులలోను పరిగెత్తకూడదు. కుక్క తరుముతుంటే చక్కగా నీలుక్కొని అటు ఇటు కదలకుండా, అరవకుండా తలవంచుకొని వీలైతే కళ్ళు మూసుకుని చెట్టు లాగా నిలబడి పోవాలి. ఎందుకంటే ఆరిచినా, పరిగెత్తినా, దాని కళ్ళల్లోకి చూసినా కుక్క కరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తకూడదు. పరిగెత్తితే కుక్క మన కంటే వేగంగా పరిగెత్తి తీవ్రంగా గాయపరిచే అవకాశం ఎక్కువ. అందుకే పరిగెత్తడం మానేసి టపీమని ఆగిపోవాలి. ఆగిపోవాలని చెప్పడం చాలా సులభం కాని ఆచరించడం చాలా కష్టం. కష్టమైనా ఆచరించడం అవసరం.
మనల్ని కరిచిన కుక్కను ఏమి చేయాలి?
ఎక్కువ సందర్భాలలో సాధారణ ప్రజానీకం చేస్తున్న పని ఏమిటంటే ఆ కుక్కను కొట్టి చంపేయడం. ఎందుకు అలా చేస్తారంటే ఆ కుక్క మీద వచ్చిన కోపం ఒక కారణమైతే ఆ కుక్క మరికొందరిని కరుస్తుందేమో అన్న అనుమానం మరొక కారణం. దయచేసి మనల్ని కరిసిన కుక్కను కొట్టొద్దు, చంపొద్దు. ఎందుకంటే మనల్ని కరిచిన కుక్క కరిచిన రోజు నుంచి పదో రోజు వరకు బ్రతికి ఉంటే ఆ కుక్క కాటు వల్ల మనకు రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం లేనేలేదు. అందుకే ఆ కుక్కను పది రోజులు పాటు గమనిస్తూ ఉండాలి. వీలైతే ప్రత్యేకమైన గదులలో కానీ ప్రత్యేకమైన ప్రాంతాలలో కానీ బంధించి జాగ్రత్తగా ఆహారం పెట్టుకుంటూ బ్రతికించుకోవడం చాలా అవసరం. రేబీస్ వ్యాధి లక్షణాలున్న ఏ జంతువు వ్యాధి లక్షణాలు కనపడిన రోజు నుంచి పది రోజులకు మించి బ్రతుకదు. మనల్ని కరిచిన కుక్క పది రోజులు బ్రతికి ఉంది అంటే దానికి రేబిస్ లేనట్టే. దానికే లేనప్పుడు దాని కాటు వల్ల మనకు రేబిస్ వచ్చే అవకాశం లేనే లేదు కదా.
కుక్క కరిచిన గాయాన్ని ఏమి చేయాలి?
ముఖ్యంగా రెండు పనులు చేయాలి. మొదటిది గాయం నుంచి రక్తం కారడాన్ని ఆపడం. రెండవది రేబీస్ వ్యాధి రాకుండా గాయాన్ని శుభ్రంగా కడగడం. శుభ్రమైన గుడ్డని గాయం మీద ఐదు నిమిషాల పాటు అదిమి పట్టుకుంటే చాలా సందర్భాలలో రక్తం కారడం ఆగిపోతుంది. అలా చేసినా రక్తం కారడం ఆగకపోతే గుడ్డని అదిమి పట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళితే దానికి కుట్లు వేయవలసిన అవసరం ఉందా లేదా అన్నది నిర్ణయించుకుని మిగిలిన వైద్యం డాక్టర్ చేస్తారు. రక్తం కారడం ఆగిన తర్వాత గాయాన్ని వీలైనంత త్వరగా నీళ్లతో కడిగితే మనల్ని కరిచిన కుక్క పిచ్చిదైనా రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం దరిదాపుగా 80 శాతం నివారించవచ్చు. రేబిస్ వ్యాధితో బాధపడుతున్న కుక్క లాలాజలంలో రేబిస్ వైరస్ ఉంటుంది. గాయంలోకి ప్రవేశించిన కుక్క లాలాజలాన్ని కడగడమే మనం చేయవలసిన పని. పై పైన కడగడం కాదు గాయం ఎంత లోతు ఉందో అంత లోతుల్లోకి కడగాలి.
ఎలా కడగాలి?
సబ్బుతో కడగడం మంచిది. డెట్టాల్ తో కానీ, ఐయోడిన్ ద్రావణంతో కానీ కడగడం ఇంకా మంచిది. ఇవేమీ లేని పరిస్థితుల్లో మామూలు నీళ్లతో కడిగినా మంచిదే. ఒక్కసారి కాదు పది సార్లు కడగాలి. ఒక్క నిమిషం కాదు పదిహేను నిమిషాల పాటు కడగాలి. కుళాయి కింద గాయాన్ని పెట్టి ధారగా నీళ్లు గాయం లోతుల్లోకి పోయేటట్టు కడగాలి. అందుబాటులో కుళాయి లేనప్పుడు మగ్గులో నీళ్ళు తీసుకొని ఎత్తుగా పెట్టి కుళాయి నీళ్లు పడ్డట్టు గాయంలో నీళ్లు పోస్తూ కడగాలి. ఇలా వెంటనే కడిగితే మంచిది. వెంటనే కడగలేనప్పుడు నాలుగు రోజుల లోపు కడిగినా మంచిదే.. . వెంటనే కడిగితే ఫలితం ఎక్కువ. రోజులు గడిచే కొద్దీ ఫలితం తగ్గిపోతూ ఉంటుంది.
కుక్క కాటుకు వ్యాక్సిన్
కుక్క మనిషిని కరిస్తే మనషికి రేభీస్ రాకుండా, కుక్క మరొక కుక్కను కరిసినా కుక్కకు రేబీస్ రాకుండా చేయగల అమోఘమైన వ్యాక్సిన్లు కుక్కలకు మరియు మనుషులకు అందుబాటులోకి వచ్చి ఉన్నాయి. వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నా వ్యాక్సిన్ అవసరమైన వ్యక్తి సరైన సమయంలో సరైన మోతాదులో తీసుకోకపోవడం రేబీస్ మరణాలకు ప్రధాన కారణం.
రేబిస్ వ్యాక్సిన్ వేసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. కుక్క కరవకముందే వ్యాక్సిన్ వేయించుకునే పద్ధతి ఒకటి (pre exposure profile access). కుక్క కరిచిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకునే పద్ధతి రెండవది(post exposure profile access). మనకున్న ఆర్థిక సామాజిక,రాజకీయ పరిస్థితుల్లో ప్రజలందరూ కుక్క కరవకముందే వ్యాక్సిన్ వేసుకోవడమన్నది అసాధ్యం. కుక్క కరిచిన వారందరూ తప్పక సమయానికి వ్యాక్సిన్ వేయించుకోగలిగితే రేబిస్ వ్యాధిని అంతం చేయడం పెద్ద కష్టం కాదు.
కుక్క కాటు వ్యాక్సిన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు వేస్తారని. కానీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేయడాన్ని చాలా కాలం నుంచి మనదేశంలో ఆపేశారు. ఎందుకంటే బేబీస్ వ్యాక్సిన్ వేసుకున్న కారణంగా కొద్ది మందికి వ్యాక్సిన్ వికటించి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉండేవి. ఈ వ్యాక్సిన్ మీద అనేక ప్రయోగాలు చేసి కొత్త రకమైన వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులోనికి తెచ్చారు. ఇప్పుడు వ్యాక్సిన్ వికటించే పరిస్థితి దరిదాపుగా లేదు.ఈ వ్యాక్సిన్ని బొడ్డు చుట్టూ కాకుండా చేతి కండరానికి వేస్తారు. దీని మీద కూడా అనేక ప్రయోగాలు జరిపి చర్మం లోకి వేసే కొత్త పద్ధతిని కనుక్కున్నారు. రేబిస్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న తర్వాత నుంచి రక్షణ ప్రారంభమై మూడవ డోసు వేసుకున్న తరువాత దరిదాపుగా పూర్తిగా రక్షణ కలుగుతుంది.
కుక్క కరవకముందే వ్యాక్సిన్ వేయించుకోవాలా లేక కుక్క కరిచిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలా అన్నది మరో పెద్ద ప్రశ్న. విపరీతంగా వీధి కుక్కలు ఉన్న మన దేశంలో కుక్క కరవకముందే వాక్సిన్ వేయించుకోవడం మంచిది. అంత భారీ మోతాదులో వ్యాక్సిన్ అందుబాటులో లేదు కాబట్టి
కనీసం కుక్క కరిచే అవకాశం ఎక్కువగా ఉన్న పశు వైద్యశాలలో పనిచేసే వైద్య బృందం తప్పక ఈ వ్యాక్సిన్ ను షెడ్యూల్ ప్రకారం వేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీరిని ఎప్పుడు ఏ కుక్క కరుస్తుందో తెలియదు కాబట్టి.
ఈ పద్ధతిలో మూడు ఇంజక్షన్లు వేస్తారు మొదటిరోజు, ఏడవ రోజు మరియు 14వ రోజు. ఈ పద్ధతిలో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల దరిదాపుగా రెండు సంవత్సరాలు పాటు రక్షణ పొందగలరు. రెండు సంవత్సరాల తరువాత మళ్లీ ఇదేవిధంగా వ్యాక్సిన్ వేయించుకోవడం అవసరం.
కుక్క కరిచిన తర్వాత వీలైనంత త్వరగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కరిచిన రోజునే వేయించుకోవడం మరీ మంచిది. ఐదు డోసులు వేసుకోవాలి. కరిచిన రోజు, మూడవరోజు, ఏడవ రోజు,14వ రోజు మరియు 28వ రోజు(0-3-7-14-28). ఇలా వెంటనే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం కారణంగా మనల్ని కరిచిన కుక్క పది రోజులలో చనిపోయినా మనకి రేబిస్ వచ్చే అవకాశం దరిదాపుగా ఉండదు. కరిచిన కుక్క వీధి కుక్క అయినా, పెంపుడు కుక్క అయినా తప్పక రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. పెంపుడు కుక్క యజమానులు ఆ కుక్కకు బేబీస్ వ్యాక్సిన్ వేయించి ఉండవచ్చు. వేయించినా ఆ కుక్కకు సరిపోయినంత వ్యాధి నిరోధక శక్తి ఉండకపోవచ్చు. అందుకని ఏ కుక్క కరిచినా వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవడం మొదలుపెట్టి ఆ కుక్కను పది రోజులు పాటు గమనించుకోవాలి. ఆ కుక్క పది రోజులపాటు బ్రతికి ఉంటే మనం వేయించుకోవలసిన 14వ రోజు మరియు 28వ రోజు వేయించుకోవలసిన డోసులను ఆపేయాలి. అప్పటికే వేసుకున్న మూడు రోజులు వృధా కదా అని అనుకోవలసిన అవసరం లేదు. రేబిస్ ముందు జాగ్రత్త టీకా లాగా ఉపయోగపడి మరో రెండు సంవత్సరములు పాటు ఏ కుక్క కరిచిన రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు.
రేబిస్ వ్యాక్సిన్ రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరియు ప్రైవేటు ఆసుపత్రులలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులలో ఒక్కొక్క డోసు 350 రూపాయలవుతుంది. ఐదు డోసుల కోర్సు వాడాలి.
కుక్క కరిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు కరచిన కుక్క ఇంటి కుక్క అయినా వీధి కుక్క అయినా తప్పక గాయాన్ని శుభ్రంగా కడగాలి. ప్రధానంగా పిల్లలు కుక్కల వద్దకు వెళ్లకుండా చూడాలి. పిల్లలు కుక్కల దగ్గర ఉన్నప్పుడు తప్పక తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఇంటి కుక్కలకు క్రమం తప్పక వ్యాక్సిన్ వేయించాలి. అమెరికా వంటి దేశాల్లో వారి పిల్లలకు వ్యాక్సిన్ వేయించుకున్నా పెద్ద తప్పు కాదు కానీ వారి కుక్కలకు వ్యాక్సిన్ వేయించకుంటే వారిపై కేసులు పెడతారు. కుక్క కరవడమే కాదు నాకడం కూడా ప్రమాదమే. రేబీస్ రహిత దేశంగా మారాలంటే వాక్సిన్ ఒక్కటే నివారణ మార్గం.
డా. యం.వి.రమణయ్య,
రాష్ట్ర అధ్యక్షులు,
ప్రజారోగ్య వేదిక,
ఆంధ్రప్రదేశ్.