పర్యావరణం తోనే మన జీవిత పయనం, ఆరోగ్యం ముడిపడి ఉంది
పర్యావరణం తోనే మన జీవిత పయనం, ఆరోగ్యం ముడిపడి ఉంది
ప్రజారోగ్యవేధిక రాష్ట్ర అధ్యక్షులు డా.యం.వి.రమణయ్య
విశాఖపట్నం వైద్యం, ఏప్రిల్ 7 (సదా మీకోసం) :
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజారోగ్య వేధిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డా.యం.వి.రమణయ్య, టి. కామేశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సదర్భంగా ఈ సంవత్సరం ” మన భూమి – మన ఆరోగ్యం ” అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ప్రజల ముందుకు తెచ్చిందని తెలిపారు.
పర్యావరణం తోనే మన జీవిత పయనం, ఆరోగ్యం ముడిపడి ఉంది. పర్యావరణం కలుషితమైతే ఆరోగ్యం చిక్కుల్లో పడుతుందని అన్నారు.
ఇప్పటికే దీని అనర్థాలను అనుభవిస్తున్నామని, ఇది వివిధ రకాల జబ్బులకు కారణం అవుతుందని, అనేక జబ్బులకు జీవనశైలితో పాటు కాలుష్యం దోహదం చేస్తుండడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు.
అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కాలుష్యం నుండి భూమిని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హెచ్చరిస్తుందని అన్నారు.
ఇదే సందర్భంలో ఆరోగ్యం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అందని ద్రాక్ష పండు లాగే ఉందని, ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కాకుండా ఇది సాధ్యపడే విషయం కాదని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అరకొర నిధులు కేటాయింపు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, వైద్య పరికరాల కొరత, అధిక మందుల ధరలు వెరసి సామాన్య ప్రజానీకాన్ని మరింత పేదరికంలోకి నెడుతున్నాయన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణుల కమిటీల సూచనల మేరకు స్థూల జాతీయ ఉత్పత్తిలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు ఐదు శాతానికి పెంచనిదే అందరికీ ఆరోగ్యం అన్న నినాదం నినాదం గానే మిగిలిపోతుందని పేర్కొన్నారు.
కావున ప్రజల ఆరోగ్యం హక్కుగా రాజ్యాంగంలో కల్పించి గణనీయంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సమాజ అభివృద్ధి, ఆర్థిక పురోగతికి ఉపకరించే ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి రాజకీయ పార్టీల ప్రధాన ఎజెండాగా మార్చే వరకు ప్రజలు, ప్రజా సంఘాలు, సైన్స్ సంస్థలు, ఉద్యోగులు, కార్మికులు, వివిధ సంస్థలు బలమైన ఉద్యమాన్ని, కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతగా యూనివర్సల్ హెల్త్ కేర్ ను అమలు పరచాలని, మందుల ధరలను తగ్గించాలని, మందులపై జిఎస్టి ని రద్దు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యాన్ని హక్కుగా ప్రతి పౌరునికి అందించాలని డా.యం.వి.రమణయ్య డిమాండ్ చేశారు.