మోడీ వినాశకర విధానాలను తిప్పి కొట్టండి : కార్మిక సంఘాల నాయకులు
మోడీ వినాశకర విధానాలను తిప్పి కొట్టండి
కార్మిక సంఘాల నాయకులు
నెల్లూరు, మార్చి 28 (సదా మీకోసం) :
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రయివేటీకరణ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు ఐక్యం కావాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
సోమవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుండి గాంధీ బొమ్మ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె అజయ్ కుమార్, సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ జనరల్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య, ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర అధ్యక్షులు జె కిషోర్ బాబు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు సాగర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు, కర్షకులు ఐక్యమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రజలను రక్షించాలని.. దేశాన్ని కాపాడాలని రెండు రోజుల పాటు జరగనున్న అఖిల భారత సార్వత్రిక సమ్మెలో ప్రజలు భాగస్వాములు కావాలని వారు కోరారు. మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య సెంటిమెంట్ను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు.
మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పోరేట్లకు కట్టబెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ నడి బజారులో అమ్మకానికి పెట్టడమేనా బిజెపి దేశభక్తి అని ప్రశ్నించారు.
గడచిన రెండున్నరేళ్లుగా కరోనా సృష్టించిన కల్లోలం కారణంగా అసంఘటితరంగ కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని, వ్యాపారాలు దెబ్బ తింది చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని, కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయారని అన్నారు.
నష్టపోయిన వారిని ఆదుకునేందుకు మోడీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకుండా దున్నపోతుపై వాన పడ్డ చందంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కార్మిక చట్టాలకు సవరణలు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికులను బానిసలుగా మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు.
వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పెద్దయెత్తున పోరాడిన క్రమంలో మోడీ ప్రభుత్వం దిగివచ్చి అనేక హామీలు ఇచ్చిందని వాటిని నేటికీ అమలు పరచకపోవడం దుర్మార్గమని అన్నారు.
కోవిడ్ వారియర్ పై పూలు చల్లి సరిపెట్టేశారని, కోవిడ్ బారినపడిన వారికి వైద్యసేవలు అందిస్తూ మృతిచెందిన వారి కుటుంబాలను నేటికి ఆదుకోకపోవడం ఈ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరించేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని, నెల్లూరు జిల్లాలోని ఏకైక ప్రభుత్వరంగ సంస్థ అయిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రయివేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని హితవు పలికారు.
మోడీ ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలు నశించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పనులకు నిధులు పెంచి పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాలని, కోవిడ్ విధులలో ఉంటూ మరణించినవారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్న సెస్సును భారీగా తగ్గించాలని, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
మోడీ నిరంకుశ వైఖరి నిరసనగా రేపు నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద జరుగు మానవహారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ డౌన్ డౌన్ మోడీ, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటాం, మోడీని గద్దె దించుతాం, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఇదేమీ రాజ్యం. ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం.., కార్మిక, కర్షక, ప్రజాసంఘాల ఐక్యత వర్ధిల్లాలి, మతోన్మాదం నశించాలి అనే నినాదాలతో హోరెత్తింది.
ఈ ర్యాలీలో సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ శ్రీనివాసులు, జి నాగేశ్వర రావు, కత్తి శ్రీనివాసులు, మస్తాన్ బీ, ఎ.ఐ.టి.యు.సి నాయకులు దామా అంకయ్య, రాంబాబు , బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సుమన్, వివిధ ట్రేడ్ యూనియన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.