పారిశుద్ధ్య నిర్వహణను ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలి
పారిశుద్ధ్య నిర్వహణను ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలి
రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ పిలుపు
నెల్లూరు (జడ్పీ), నవంబర్ 20 (సదా మీకోసం) :
సమాజంలో పారిశుద్ధ్య నిర్వహణను ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరు దర్గామిట్ట లోని జిల్లా ప్రజా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేశారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్,జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) గణేష్ కుమార్ పాఠశాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దేశంలోని సైనికుల మాదిరిగానే పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలన్నారు.
నాడు నేడు పథకం కింద రాష్ట్రంలోని 47 వేల పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించామని గుర్తు చేశారు. మరుగుదొడ్లను శుభ్రపరచడం కేవలం పారిశుద్ధ్య కార్మికుల పని మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ తాము వాడిన మరుగుదొడ్లను వెంటనే శుభ్రం చేసుకునే అలవాటు చేసుకోవాలన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు.
ఈ పాఠశాల చాలా చక్కగా ఉందని ఉపాధ్యాయులు, విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ మాట్లాడుతూ నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించడంలో విద్యాశాఖ కార్యదర్శి కృషి ఎంతో ఉందన్నారు.
ప్రభుత్వం గొప్ప ఉద్దేశంతో నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చిందని, వీటిని పదిలంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, విద్యార్థులపై ఉందన్నారు. అలాగే మరుగుదొడ్లను శుభ్రపరచడం చిన్నతనం కాకూడదని, దానిని మన బాధ్యతగా గుర్తించి పారిశుద్ధ్య నిర్వహణకు అందరూ కలసిమెలసి పనిచేయాలన్నారు.
అనంతరం పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న ఆయా లను వారు ఘనంగా సత్కరించారు. ఈ సభలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, డిప్యూటీ డీఈవో రఘురామయ్య, ఇన్చార్జి ఎంఈఓ దిలీప్ కుమార్, ఇన్చార్జి హెచ్ఎం విజయలక్ష్మి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ అంజలి, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, విజయ, దీప కళ, జయశ్రీ, హరి తదితరులు పాల్గొన్నారు.