మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటా : ముఖ‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

0
Spread the love

మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటా

నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడిన గౌతమ్ రెడ్డి

సంగం బ్యారేజ్ కి గౌత‌మ్ రెడ్డి పేరు

ఎంత చెప్పినా, ఎంత మాట్లాడినా ఆ లోటును భర్తీ చేయలేం

గౌతమ్‌ అగ్రస్ధానంలో ఉంటాడు, ఉన్నాడు

దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప సభలో ముఖ‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

నెల్లూరు ప్ర‌తినిధి, మార్చి 28 (స‌దా మీకోసం) :

 

 

నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని, మే 15 తేదీలోగా సంగం బ్యారేజ్ పనులను పూర్తి చేసి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ గా నామకరణం చేసి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

సోమవారం ఉదయం నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులో గల వీపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నిర్వహించిన దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు.

ముందుగా ముఖ్యమంత్రి, మేకపాటి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డిని, తల్లి మణిమంజరిని, సతీమణి కీర్తిని సీఎం పరామర్శించి ఓదార్చారు.

     
అనంతరం జరిగిన సంతాప సభ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల గుండెల్లో గౌతమ్ రెడ్డి చిరకాలం నిలిచేలా సంగం బ్యారేజ్ కు ఆయన పేరు పెడుతున్నట్లు చెప్పారు.

ఈ రోజు ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఏరోజూ తాను కలలో కూడా ఊహించలేదని, గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉందని, ఇంకా కనిపిస్తూనే ఉంటాడన్నారు.

రోజులాగే వస్తున్నట్టుగానే ఉందని, తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా సమయం పడుతుందన్నారు.

గౌతమ్‌ గురించి చెప్పాలంటే… నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయమని, మంచి స్నేహితుడన్నారు. తను నువ్వు చేయగలుగుతావు… మేమంతా ఉన్నాం అని నన్ను ప్రోత్సహించేవాడని, అటువంటి ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామన్నది ఈ రోజుకు కూడా జీర్ణం చేసుకోలేని అంశమన్నారు.

ఒక మంచి మంత్రిగా కొనసాగాడని, పరిశ్రమలు, ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు దాదాపు ఆరుశాఖలు నిర్వహించాడని, ప్రతి సందర్భంలోనూ పరిశ్రమలు ఇక్కడికి తీసుకురావాలని, ఇక్కడికి తీసుకుని వస్తే… రాష్ట్ర ప్రభుత్వానికి, నాకు వ్యక్తిగతంగా మంచి పేరు వస్తుందని ఎప్పుడూ తాపత్రయపడేవాడన్నారు.

అందులో భాగంగానే బహుశా చివరి క్షణాల్లో దుబాయ్‌ వెళ్లాడని, వెళ్లేముందు నాకు కనిపించాడని, దుబాయ్‌కి వెళ్లి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాల మీద నన్ను కలవాలని సమయం కూడా అడిగాడని, అంతలోపే ఈ సంఘటన జరిగిందన్నారు.

ప్రతి సందర్భంలోనూ ఒక మంచి మంత్రిగా, మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి స్నేహితుడిగా అన్నిరకాలుగా ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని, జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నారు.

ఎంత చెప్పినా, ఎంత మాట్లాడినా ఆ లోటును భర్తీ చేయలేమని.. కానీ మనిషి వెళ్లిపోయిన తర్వాత ఎంతమంది మనసుల్లో నిలిచిపోయాడు అన్నది మాత్రం కచ్చితంగా నిలబడిపోతుందని, ఆ విషయంలో గౌతమ్‌ అగ్రస్ధానంలో ఉంటాడు, ఉన్నాడని జగన్ భావోద్వేగంతో అన్నారు.

అన్ని రకాలుగా ఆ కుటుంబానికి మంచి జరగాలని మనసారా మరొక్కసారి కోరుకుంటున్నానని చెబుతూ ముఖ్యమంత్రి తన ప్రసంగం ముగించారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గౌతమ్ రెడ్డితో తనకు పన్నెండేళ్ల నుంచి మంచి అనుబంధం ఉందని, అజాతశత్రువుగా పేరుగాంచిన గౌతమ్ రెడ్డి జగనన్నకు ఒక సైనికుడిలా పనిచేశారని, జగనన్న ఆశీస్సులతో తామిద్దరం ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా జిల్లాలో మంత్రులుగా పని చేసామని గుర్తు చేశారు.

గౌతమ్ అన్న లేని లోటు ఎప్పటికీ తీరదని, వారి కుటుంబం త్వరగా కోలుకునేలా భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరారు.

ముందుగా సంతాప సభ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి మరణం యావత్ ఆంధ్రప్రదేశ్ కు తీరనిలోటుగా మిగిలిపోతుందన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు దివంగత మంత్రి ఎంతో కృషి చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా 65 భారీ పరిశ్రమలు, జిల్లాలో 15 భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి 25 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా గౌతమ్ రెడ్డి పనిచేశారని, ప్రజా మనిషిగా పేరుగాంచిన గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కలెక్టర్ కోరారు.

సభకు అధ్యక్షత వహించిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప సభను రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు అంతా తామై వ్యవహరించి నిర్వహించినందుకు జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.

గౌతం రెడ్డి కోరిక మేరకు ఆమంచర్ల లో 500 ఎకరాల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు తమ కుటుంబం పట్ల చూపిన శ్రద్ధాసక్తులు మర్చిపోలేమని, అన్ని విషయాల్లో తమకు అండగా నిలిచారని చెప్పారు. ఉదయగిరి లోని మెరిట్ కళాశాలలో వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎంకు విన్నవించారు.

అలాగే వెలిగొండ ప్రాజెక్ట్, హై లెవెల్ కెనాల్ పనులను పూర్తిచేయాలని కోరారు. తమ కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంతాప సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, వాకాటి నారాయణరెడ్డి, పోతుల సునీత, తలసిల రఘురాం, నగర మేయర్ స్రవంతి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వెలగపల్లి వరప్రసాదరావు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మేకపాటి కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ముఖ్య‌మంత్రికి స్వాగతం ప‌లికిన వైకాపా నాయ‌కులు, అధికారులు

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభకు హాజరయ్యేందుకు నెల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు స్వాగతం పలికారు.

ఉదయం 11:52ని. లకు నెల్లూరు కు చేరిన ముఖ్యమంత్రి తో పాటు జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖామాత్యులు బాలినేని శ్రీనివాసుల రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఉన్నారు.

ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖామాత్యులు పి అనిల్ కుమార్, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ , శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ చక్రవర్తి , శాసన సభ్యులు ఆనం రామ నారాయణ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి , రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి, వి. వరప్రసాద్ రావు, కిలివేటి సంజీవయ్య, రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, డిఐజి త్రివిక్రమ వర్మ, జిల్లా ఎస్పీ విజయా రావు, , నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాధ్ , నెల్లూరు నగర మేయర్ పోట్లురి స్రవంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ దొంతు శారద, రాష్ట్ర సంగీత, నృత్య అకాడమీ చైర్ పర్సన్ పొట్టేళ్ల సుజాత, రాష్ట్ర జంగమ కార్పొరేషన్ చైర్ పర్సన్ వి. ప్రసన్న, రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ చైర్ పర్సన్ సైదాని, ఏపీ స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ , ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్ పర్సన్ పెర్నాటి సుస్మిత, విజయా డేయిరీ చైర్మన్ రంగారేడ్డి తదితరులు ఉన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య కార్యకర్తలను పేరుపేరునా పలకరించి వారితో కరచాలనం చేశారు.

అనంతరం వి పి ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో దివంగత మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని 1:35 కు తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు.

కార్యక్రమంలో జిల్లా శాసనసభ్యుల తో పాటు జాయింట్ కలెక్టర్లు హరెంధర ప్రసాద్, యం .జాహ్నవి, ట్రైనీ కలేక్టరు ఫర్హన్ అహ్మద్ ఖాన్, నాయుడుపేట రెవెన్యు డివిజనల్ అధికారిణి సరోజనమ్మ తదితర అధికార అనధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!