మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ పూర్తి

Spread the love

మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ పూర్తి

లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక

కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వ‌హ‌ణ‌

ఒంగోలు, ఆక్టోబ‌ర్ 14 (స‌దా మీకోసం) :

జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని 171 మద్యం షాపుల కోసం 3466 దరఖాస్తులు రావడంతో అధికారులు సోమవారం లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు.

ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు కౌంటర్ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

కలెక్టర్ నేతృత్వంలోని కౌంటర్ -1 లో ఒంగోలు, చీమకుర్తి, శింగరాయకొండ, పొదిలి ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని 80 షాపులకు, జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కౌంటర్ -2 లో దర్శి, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, కంభం, యర్రగొండపాలెం స్టేషన్ల పరిధిలోని 91 షాపులకు లాటరీ నిర్వహించారు.

జోరున వర్షం కురుస్తున్నప్పటికీ ఈ ప్రక్రియకు, వచ్చిన దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఉదయం 8 గంటలకు మొదటి డ్రా తీయడంతో ప్రారంభమైన ఈ లాటరీ ప్రక్రియ మధ్యాహ్నం 1.45 గంటలకు ముగిసింది.

మొత్తం లాటరీ ప్రక్రియను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీడియో తీసి ఎల్.ఈ.డి. స్క్రీన్ల ద్వారా ప్రదర్శించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

షాపుల వివరాలు, దరఖాస్తుదారుల పేర్లు, లాటరీలో ఎంపిక అయిన వారి పేర్లను మైకుల ద్వారా అధికారులు అప్పటికప్పుడే ప్రకటించి ఈ మొత్తం ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశారు.

ఒక్కో షాపుకోసం మూడు లాటరీలను తీశారు. మొదటి లాటరీలో విజేతను ఎంపిక చేశారు.

అదేవిధంగా మరో ఇద్దరు రిజర్వ్ అభ్యర్థులను కూడా ఎంపిక చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్.పి. ఏ.ఆర్.దామోదర్ అధ్వర్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

లాటరీలో ఎంపికైన 171 మందిలో 15 మంది మహిళలు ఉన్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఖాజా మోహీయుద్దీన్ చెప్పారు.

ఎంపికైన వారు లైసెన్స్ రుసుములో ఆరో వంతు చెల్లించిన అనంతరం వారికి మంగళవారం ప్రొవిజనల్ లైసెన్స్లు అందజేస్తామని అన్నారు.

వీరు బుధవారం నుంచి షాపులను ప్రారంభించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కె. హేమంత్ నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ, డి.ఆర్.ఓ. ఆర్.శ్రీలత, ఆర్.డి.ఓ. కె.లక్ష్మీప్రసన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, సత్యనారాయణ, కుమార్, జడ్పీ సి.ఈ.ఓ. చిరంజీవి, ఏ.ఎస్.పి. నాగేశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం : నెల్లూరులో మంత్రి నారాయణ

Spread the loveఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం నెల్లూరులో మంత్రి నారాయణ నెల్లూరు, ఆక్టోబ‌ర్ 14 (స‌దా మీకోసం) : జిల్లాలో మూడురోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. అల్పపీడనం తుపానుగా మారితే ఈ నెల 17న తీరం దాటొచ్చని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబు కీలక సలహాలు, సూచనలు […]

You cannot copy content of this page