వరద నీటిలో చిక్కుకున్న తండ్రి కొడుకులను కాపాడే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన కానిస్టేబుల్
వరద నీటిలో చిక్కుకున్న తండ్రి కొడుకులను కాపాడే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన కానిస్టేబుల్
- బుచ్చి రెడ్డి పాలెం దామరమడుగు వద్ద వరద సహాయక చర్యలలో విషాదం…
- మరణ వార్త విని శోకసంద్రంలో జిల్లా పోలీసు శాఖ.. అమర వీరుని స్మరిస్తూ మౌనం పాటించిన జిల్లా యస్.పి., జిల్లా పోలీసు యంత్రాంగం
బుచ్చి రెడ్డి పాలెం, నవంబర్ 20 (సదా మీకోసం) :
బుచ్చిరెడ్డి పాలెం దామరమడుగు వద్ద వరద నీటిలో చిక్కుకొని కరెంట్ పోల్ ను ఎక్కి ఉన్న తండ్రి, కొడుకుల్ని కాపాడేందుకు కానిస్టేబుల్ వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. జలమయమైన ప్రమాదకర పరిస్థితులను కూడా లెక్కచేయకుండా తన బృందంతో సహాయ చర్యలు అందించడానికి వెళ్లి కానిస్టేబుల్ శ్రీనివాసరావు ప్రాణాలను విడిచారు.
ఎపిఎస్‌పి 5వ బెటాలియన్ లో 2013 వ సంవత్సరం నుండి విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస రావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కండిస గ్రామం…ఇతనికి వివాహమై ఒక కుమారుడు వున్నాడు. శనివారం ఉదయం 8:30 గంటల సమయంలో దామరమడుగు నందు ప్రమాద బాధితులను రక్షిస్తున్న సమయంలో వరద నీరు ఎక్కువ రావడంతో లైఫ్ జాకెట్ జారిపోవడంతో ఊపిరాడక నీరుతాగి మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పి కానిస్టేబుల్ మృతికి సంతాపం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ, విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమర వీరుల త్యాగాలకు సదా చిరస్మరణీయమని, సాటి మనిషిని కాపాడాలన్న తపన వల్లనే తమ ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను పోలీసులు కాపాడుతున్నారని అన్నారు. రక్షించబడిన తండ్రి కొడుకులు యస్.పి. వద్దకు వచ్చి కన్నీటి పర్యంతమై, మమ్మల్ని రక్షించుటలో కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.. మేము పోలీసు శాఖకు జీవితాంతం ఋణపడి ఉంటామని వాపోయారు.