కేంద్ర విద్యా పథకాలపై అవగాహన కలిగించారా? పార్లమెంట్ లో అడిగిన ఎంపీ ఆదాల

కేంద్ర విద్యా పథకాలపై అవగాహన కలిగించారా?
పార్లమెంట్ లో అడిగిన ఎంపీ ఆదాల
ఢిల్లీ, మార్చి 28 (సదా మీకోసం) :
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలపై దేశవ్యాప్తంగా ఎలాంటి అవగాహనను కలిగించారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్లో సోమవారం రాతపూర్వకంగా ప్రశ్నించారు.
ఇందుకు అనుసరించిన మార్గాలేమిటని కూడా అడిగారు. దీనికి కేంద్ర విద్యా, అక్షరాస్యత మంత్రి అన్నపూర్ణ దేవి సమాధానమిస్తూ విద్య, అక్షరాస్యత విషయాల్లో అవగాహన కల్పించడానికి ఎన్నో చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
“సమగ్ర శిక్ష” అనేది కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకమని, ఇది పిల్లల సర్వతోముఖ అభివృద్ధిని సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని, ప్రతి స్కూలుకు 1500 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు.
దీనిపై అవగాహన కోసం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి, స్కూల్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కమిటీకి శిక్షణ అందిస్తామని, దీనికి ప్రతి ప్రభుత్వ పాఠశాలకు 3000 రూపాయలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
2016 సెప్టెంబర్ 15 నుంచి “స్వచ్ఛత పక్వాడా” పాటిస్తున్నట్లు తెలిపారు.7,82,827 పాఠశాలలకు చెందిన 3’78’15,074 మంది విద్యార్థులు 2021 వరకు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల కోసం “శిక్షక్ పర్వ్” ప్రత్యేకంగా 2020 సెప్టెంబర్ 8 నుంచి 25 వరకు నిర్వహించామని, ఇది విద్యార్థులు, బోధకుల ద్వారా నాణ్యమైన విద్య అందించడానికి ఉపకరిస్తుందని తెలిపారు.
దీంతోపాటు ప్రింట్, ఆడియో విజువల్ మీడియా ప్రచారం, కళాజాతాలు, రోడ్ షోలు, బహిరంగ సభలు, పాద యాత్రలతో సహా దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.