ఆదర్శనీయుడు భూపోరాటాల సారధి కామ్రేడ్ జక్కా వెంకయ్య : జి నాగేశ్వరరావు
ఆదర్శనీయుడు భూపోరాటాల సారధి కామ్రేడ్ జక్కా వెంకయ్య : జి నాగేశ్వరరావు
నెల్లూరు, మే 29 (సదా మీకోసం) :
భూపోరాటాలు సారథి కామ్రేడ్స్ జక్కావెంకయ్య నేటి తరాలకు ఆదర్శప్రాయుడని సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ శ్రీనివాసులు, జి నాగేశ్వరరావు అన్నారు.
ఆదివారం జక్కా వెంకయ్య వర్ధంతి సందర్భంగా సిపియం, సిఐటియు 47&48వ డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రి లోని ప్రసూతి మరియు చిన్నపిల్లల విభాగంలోని తల్లులు, గర్భిణీలకు రొట్టెలు, పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా జక్కా వెంకయ్య ప్రజలకు సుపరిచితులని అన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి భూస్వామ్య విధానంపై తిరుగుబాటు చేసిన మహనీయుడు జక్కా వెంకయ్య అని అన్నారు.
సుందరయ్య గారి ప్రేరణతో “రెడ్డి” అనే కుల చిహ్నాన్ని పేరులోంచి తొలగించుకొని జక్కా వెంకయ్యగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, తుదిశ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి నిరాడంబరంగా జీవించి ప్రజా సేవలో తరించిన మహనీయుడు జక్కా వెంకయ్య అని కొనియాడారు.
ఆయన నేతృత్వంలో జిల్లాలో కొనసాగిన భూపోరాటాల కారణంగా పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భూములు వచ్చాయని అన్నారు.
ముఖ్యంగా నెల్లూరు నగరంలోని సుందరయ్య కాలనీ, పొర్లుకట్ట సుందరయ్యనగర్, రామచంద్రారెడ్డి నగర్, వీఎమ్ఆర్ నగర్, మన్సూర్ నగర్ ప్రాంతాల్లో అనేక మంది పేదలకు ఇళ్ల స్థలాలు పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించి అందజేయడం జరిగిందని అన్నారు.
ప్రజా సంక్షేమమే తమ సంక్షేమంగా భావించి జీవితాంతం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పని చేసిన మహనీయుడు జక్కా వెంకయ్య జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని అన్నారు.
ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆ మహనీయునికి ఇచ్చే గొప్ప నివాళి అని తెలిపారు. నిరంతరం కార్మిక, కర్షక, ప్రజా సంక్షేమానికై పరితపించిన ఆ మహనీయుని వర్ధంతి సందర్బంగా నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో తల్లులు, గర్భిణీలకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశామని, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సి.పి.యం 47, 48వ డివిజన్ నాయకులు జి సురేష్, టి ఈశ్వరయ్య, కటారి బాబు, డివైఎఫ్ఐ నాయకులు జి. బాలు, పి సుబ్బరాయుడు, ప్రసాద్, యన్ ప్రేమ్, హాస్పిటల్ సిబ్బంది సంధాని భాష, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు.