పవనన్న ప్రజాబాటకు విశేష ఆదరణ లభిస్తోంది : కేతంరెడ్డి వినోద్ రెడ్డి
పవనన్న ప్రజాబాటకు విశేష ఆదరణ లభిస్తోంది
ప్రజలంతా ధైర్యంగా తమ సమస్యలు చెప్తున్నారన్న జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు నగరం, మే 29 (సదా మీకోసం) :
నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 13వ రోజుకి చేరింది.
మైపాడు రోడ్డు సింహపురి కాలనీలోని పలు వీధుల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలుకరించిన కేతంరెడ్డి వారి సమస్యలను వ్రాసుకుని పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కలిపించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గత 13 రోజులుగా తాము చేస్తున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి ప్రజల్లో నుండి అపూర్వ స్పందన లభిస్తోందని అన్నారు.
ఇన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వ అరాచక తీరు వల్ల తమ గళం వినిపించలేని వాళ్ళందరూ తమతో తమ సమస్యలను, బాధలను నిర్భయంగా చెప్తున్నారని అన్నారు.
కొన్ని ప్రాంతాల్లో వీధి లైట్లు, వీధి కుళాయిలు వంటి వాటిని కూడా వైసీపీ ప్రభుత్వం బాగు చేయలేకపోతోందని, తమ సొంత నిధులతో పలు చోట్ల వాటిని ఏర్పాటు చేసినట్టు కేతంరెడ్డి తెలిపారు.
చిన్న చిన్న సమస్యలను తాము తీర్చేస్తున్నామని, కొన్ని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని వివరించారు. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా చేసిన ప్రజలు ఇప్పుడు ఎన్నో ఆవేదనలు తమతో పంచుకుంటున్నారని అన్నారు.
వారందరికీ అండగా నిలుస్తున్నామని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో వివరిస్తున్నామని అన్నారు.
2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేపట్టిన జగన్ రెడ్డి ఆ పాదయాత్రలో తన దగ్గరికి వచ్చి బాధలు చెప్పుకున్న ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ఆర్ధిక సాయం చేయలేదని, తమ ప్రభుత్వం వస్తే సాయం చేస్తామని చెప్పారని, ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవ్వరి బాధలు తీర్చలేదని అన్నారు. కానీ తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు తన స్వంత సంపాదనలో నుండి 30 కోట్ల రూపాయలను ఆత్మహత్య చేసుకున్న 3వేల మంది కౌలు రైతు కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల వంతున ఆర్ధిక సాయం చేస్తున్నారని ప్రజలకు కేతంరెడ్డి వినోద్ రెడ్డి వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.