ప్లాస్మా దానంపై అవ‌గాహ‌న క‌ల్పించండి.. అధికారుల‌ను ఆదేశించిన క‌లెక్ట‌ర్‌

0
Spread the love

ప్లాస్మా దానంపై అవ‌గాహ‌న క‌ల్పించండి.. అధికారుల‌ను ఆదేశించిన క‌లెక్ట‌ర్‌

-: నెల్లూరు ప్ర‌తినిధి‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :-

నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు.., వైద్య శాఖ అధికారులు, ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

కోవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు.

జిల్లాలో నిన్నటి వరకూ 11, 224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో 5,976 మంది చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారన్నారు.

కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత చికిత్స తీసుకుని.., నెగటివ్ వచ్చి డిశ్చార్జ్ అయిన వారిలో యాంటీ బాడీస్ ఉంటాయని.., వారి నుంచి ప్లాస్మా సేకరించి, దాని ద్వారా మరో ఇద్దరి ప్రాణాలు రక్షించవచ్చని.., దీనిని దృష్టిలో ఉంచుకుని.., జిల్లా వైద్య శాఖ అధికారులు గత నెల రోజుల నుంచి నెగటివ్ రిపోర్టుతో డిశ్చార్జ్ అయిన వివరాలు సేకరించాలని, వారితో మాట్లాడి, ప్లాస్మా దానానికి ఒప్పించాలన్నారు.

ప్లాస్మా దానం చేస్తే దాని ద్వారా మరో ఇద్దరి ప్రాణాలు కాపాడే అవకాశం వారికి దక్కుతుందని ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు.

జూలై నెలలో కరోనా చికిత్స తీసుకుని డిశ్ఛార్జ్ అయిన వారి వివరాలు సేకరించి.., నోడల్ అధికారుల ద్వారా ప్లాస్మా సేకరించే ప్రైవేట్ ఆస్పత్రులకు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

గత నెల రోజుల్లోపు డిశ్చార్జ్ అయిన వారిలో వైద్య చికిత్సకు అవసరమైన యాంటీ బాడీస్ ఉండే అవకాశం అధికంగా ఉంటుంది అని…, ముందుగా అలాంటి వారి నుంచి ప్లాస్మా సేకరించాలన్నారు.

ప్లాస్మా దానం చేసిన ఒక్కొక్కరికీ ప్రభుత్వం.., రూ. 5,000 ప్రోత్సాహకంగా అందిస్తోందన్నారు.

జిల్లాలో ఇప్పటి వరకూ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఏడుగురి నుంచి ప్లాస్మా సేకరించి.., దాని ద్వారా నలుగురు కరోనా పేషేంట్స్ కి చికిత్స అందించామని.., వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఎంతో మెరుగైందన్న కలెక్టర్.., కరోనా పాజిటివ్ వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి ప్లాస్మాతో వైద్యం చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయని.., ఈ దిశగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీ శీనా నాయక్ ని ఆదేశించారు.

ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న సదుపాయాల ప్రకారం ప్రతి రోజూ 40 మంది నుంచి ప్లాస్మా సేకరించడానికి అవకాశం ఉందని, దానికి తగిన ఏర్పాట్లు చేస్తామని అధికారులు కలెక్టర్ కి తెలిపారు.

నెగటివ్ రిపోర్టు వచ్చి ఇంటికి వెళ్లిన 14 రోజుల తర్వాత వారి నుంచి ప్లాస్మా సేకరిస్తే మెరుగైన ఫలితం ఉంటుందని.. వైద్యులు కలెక్టర్ కి తెలిపారు.

దీంతోపాటు.., ప్లాస్మా సేకరించే ముందు నెగటివ్ రిపోర్టు వచ్చిన వ్యక్తుల రక్తంలో యాంటీ బాడీస్ ఉన్నాయో లేదో పరీక్ష చేసిన తర్వాత.., యాంటీ బాడీస్ ఉన్న వారి నుంచి ప్లాస్మా సేకరించాలని.., ప్లాస్మా సేకరించడానికి యాంటీ బాడీ కిట్స్, ప్లాస్మా థెరపీ కిట్స్ అందించాలని ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల వైద్యులు కోరారు.

దీనికి స్పందించిన కలెక్టర్ అధికారులతో చర్చించి యాంటీ బాడీ కిట్స్, ప్లాస్మా థెరపీ కిట్స్ అందిస్తామన్నారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( ఆసరా) శీనా నాయక్, అడిషనల్ డి.ఎం.హెచ్.ఓ స్వర్ణలత, ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాల ప్రతినిధులు, వైద్యులు, అధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!