కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలి
సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్
నెల్లూరు కార్పొరేషన్, మార్చి 22 (సదా మీకోసం) :
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటి పన్నుల వసూళ్ల పేరుతో కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలని సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్ చేసింది.
ఈ విషయమై మంగళవారం బాలాజీ నగర్ లోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత పది రోజుల పైనుండి కార్పొరేషన్ అధికారులు టీములుగా ఏర్పడి 25 నుండి 30 మంది దాకా గుంపు గా వెళ్లి పేదలు నివసించే ప్రాంతాలు, స్లమ్ ఏరియాలు అని కూడా చూడకుండా ఖజానా నింపుకోవడమే టార్గెట్ గా పెట్టుకుని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి దౌర్జన్యాలు,దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంటి పన్నులు పెంచాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు సిపిఎం పార్టీ గా చేపట్టిన ఆందోళనలో వైఎస్పార్ సిపి నాడు ప్రతిపక్ష హోదాలో బలపరిచినదన్నారు. నేడు అధికారంలోకి రాగానే మున్సిపల్ చట్టాన్ని సవరించి ఆస్తి విలువ ఆధారితంగా ఇంటి పన్ను విధించే పద్ధతిని అమల్లోకి తీసుకువచ్చి భారీగా ఇంటి పన్నులు పెంచడం సిగ్గుచేటన్నారు.
పెంచిన ఇంటి పనులను వేలు,లక్షల రూపాయలలో వసూలు చేయడానికి ఈ దాడులు జరుగుతున్నాయన్నారు.
కనీస మౌలిక సదుపాయాలు అయిన మంచి నీటి సరఫరా, పారిశుధ్యం, డ్రైనేజీ,దోమలు,వీధిలైట్లు సమస్యలు పరిష్కరించలేని పాలకులకు పన్నులు విధించే హక్కు లేదన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి గ్రాంట్లు తెచ్చుకునే సత్తా లేక ప్రజలపై తీవ్ర భారాలు మోపుతున్నారు అన్నారు.
హంగూ ఆర్భాటాల కోసం, ప్రచార ఆర్భాటాలు కోసం ఉన్న కాస్త ప్రజాధనాన్ని దుర్వినియోగ పరుస్తున్నారు అని అన్నారు.
కరోనా కాలంలో గత మూడు సంవత్సరాల నుండి ఉపాధి ఉద్యోగాలు కోల్పోయి పస్తులతో అప్పులతో అల్లాడుతున్న ప్రజలకు ఉన్న పన్నులను, వడ్డీలను రద్దు చేయాల్సింది పోయి అదనంగా పన్నులు పెంచడం పనికిమాలిన చర్య అన్నారు. తక్షణమే పెంచిన ఇంటి పనుల జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు దాడులు ఆపకపోతే ప్రజలను సమీకరించి సచివాలయాలు, కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగేశ్వరరావు, పి. సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు అత్తి మూరి శ్రీనివాసులు, ఆర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
………..