ప్రజలను రక్షించేందుకు… దేశాన్ని కాపాడేందుకు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం : కె. అజయ్ కుమార్
ప్రజలను రక్షించేందుకు – దేశాన్ని కాపాడేందుకు
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం : కె అజయ్ కుమార్
ప్రజలను రక్షించేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు ఈ నెల 28, 29 తేదీలలో భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగనున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు, వ్యాపారులు, ప్రజలు ఐక్యమై జయప్రదం చేయాలని సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి పి. అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రెండు రోజుల పాటు సాగనున్న ప్రచార జాతాను మంగళవారం నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ లో ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలను వేగవంతంగా అమలు చేస్తూ దేశ సంపదను స్వదేశీ, విదేశీ కార్పోరేట్లకు కారుచౌకగా కట్టబెట్టేస్తూ కార్మికులు, కర్షకులు, వ్యాపారులు, ప్రజలను కష్టాలపాలు చేస్తోందని విమర్శించారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నీరు గార్చి నాలుగు లేబర్ కోడ్స్ గా మోడీ ప్రభుత్వం మార్చివేయడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఆయిల్, బొగ్గు, సహజ సంపదలతో పాటు అడవులను కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేస్తూ దేశాన్ని దివాలా తీయిస్తున్నారని అభివర్ణించారు.
ప్రజల డబ్బుతో నిర్మించుకున్న రైల్వే రోడ్లు విమానాశ్రయాలు పోర్టులు విద్యుత్ తో పాటు ప్రజల ఆస్తులన్నింటినీ గుంపగుత్తగా కార్పొరేట్లకు కట్టబెట్టేస్తున్నారని దుయ్యబట్టారు.
అమరవీరుల త్యాగాల ఫలితంగా రాష్ట్రంలో ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కారు చౌకగా ఫోక్సో కంపెనీకి కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఐక్యమై వీరోచితంగా పోరాడుతున్నారని అయినా మోడీ ప్రభుత్వం దున్నపోతుపై వర్షం పడిన చందంగా వ్యవహరిస్తోందని అన్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వ నయా ఉదారవాద విధానాలను వ్యతిరేకించకపోగా వేగవంతంగా అమలు చేసేందుకు సహకరించడం విడ్డూరమని అన్నారు.
నెల్లూరు జిల్లాలోని ఏకైక ప్రభుత్వరంగ సంస్థ అయిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అదానీ గ్రూప్ కు కట్టబెట్టేందుకు క్యాబినెట్లో తీర్మానం చేయడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తిరోగమన విధానాలకు నిరసనగా ప్రజలను రక్షించండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఈ నెల తేదీలలో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రజలు, ప్రజాతంత్రవాదులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీఐటీయూ నెల్లూరు నగర అధ్యక్ష కార్యదర్శులు ఏ. శ్రీనివాసులు, జీ. నాగేశ్వర రావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వి రామరాజు, ఏ.ఐఎఫ్.టి.యు (న్యూ) నగర కార్యదర్శి పి. యానాదయ్య, ఐఎఫ్టీయూ జిల్లా నాయికలు సాగర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, నాయకులు పి సూర్యనారాయణ, ఆర్.శ్రీనివాసులు, జయరాం, సుధాకర్, దామోదర్ రెడ్డి, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉడత ప్రసాద్, ఎంవి రమణ, నగర కార్యదర్శి నరసింహ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.