వరద ప్రభావిత ప్రాంతాల్లో కాకాణి పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో కాకాణి పర్యటన
వెంకటాచలం, నవంబర్ 23 (సదా మీకోసం) :
వెంకటాచలం మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో రిజర్వాయర్, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాలను రైతులు, ప్రజలతో కలిసి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు.
చెరువులు, రిజర్వాయర్లు కోతకు గురికాకుండా, రైతులకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
సర్వేపల్లి రిజర్వాయర్ 2014లో కురిసిన భారీ వర్షాలకు ప్రమాదపు అంచున చేరుకుందని, సర్వేపల్లి రిజర్వాయర్ ను గురించి తెలుగుదేశం 5 సంవత్సరాల కాలం పట్టించుకోకుండా, ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హడావుడిగా జీవో జారీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ ప్రమాద బారిన పడే అవకాశం ఉన్న సర్వేపల్లి రిజర్వాయర్ నే పట్టించుకోలేదంటే, రైతాంగం పట్ల వారి శ్రద్ధ అర్థమవుతుందన్నారు.
వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, రిజర్వాయర్ మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయించి, పనులు ప్రారంభించామన్నారు.
రాబోవు రబీ సీజన్ కల్లా, సర్వేపల్లి రిజర్వాయర్ కు మరమ్మతులు పూర్తి చేసి, పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంచేలా చర్యలు చేపడతామని తెలిపారు.
భారీ వర్షాలతో నష్టం వాటిల్లిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని, మరో భారీ వర్ష సూచన నేపథ్యంలో అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.