గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించడం దురదృష్టకరం..దుర్మార్గం : సోమిరెడ్డి
గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించడం దురదృష్టకరం..దుర్మార్గం : సోమిరెడ్డి
-: నెల్లూరు, ఆగస్టు 1 (సదా మీకోసం) :-
ఏపీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన కామెంట్స్ విడుదల చేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని బీడు పెట్టాలనుకోవడం, గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించడం దురదృష్టకరం..దుర్మార్గమని విమర్శించారు.
2014 ఎన్నికల్లో ప్రజాతీర్పు మేరకు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారని తెలిపారు.
నిండు శాసనసభలో సభానాయకుడు, సీఎంగా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి రాజధానిగా అమరావతిని ఆమోదించారని గుర్తు చేశారు.
అమరావతికి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారనీ, బీజేపీ సభ్యులు కూడా మద్దతు పలికారని అన్నారు.
శాసనమండలిలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు అమరావతికి అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేశాయన్నారు.
ఇవన్నీ జరిగాక సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.
అమరావతి మరో ఢిల్లీ కావాలని మోదీ ఆశీర్వదించారనీ, ఇంతమంది చెప్పాక నమ్మి 30 వేల మంది రైతులు చరిత్రలో నిలిచిపోయేలా 34 వేల ఎకరాలు త్యాగం చేయడం తప్పా అని ప్రశ్నించారు.
మంచి రాజధాని వస్తుందని ఉజ్వల భవిత ఉంటుందని నమ్మి వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులది తప్పా అన్నారు.
పది వేల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన భవనాలను శిథిలాలుగా మార్చేస్తారా అని ప్రశ్నించారు.
ఇప్పటికే హౌసింగ్ ఫర్ ఆల్ కింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించిన 6 లక్షల ఇళ్లను పేదలకు చెందనీయకుండా బీడు పెట్టేశారన్నారు.
కక్ష సాధింపులు పేదలపై చూపడం తగదనీ, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు కూడా బాధాకరమన్నారు.
అసెంబ్లీ, శాసనమండలిలో మీరు ఆమోదించి, ప్రధాన మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న రాజధాని ఇదని మరిచిపోకండని గుర్తుచేశారు.
ఓ వైపు అమరావతికి మద్దతు అంటారు..ఇంకో మూడు రాజధానులు ప్రభుత్వ ఇష్టమంటారన్నారు.
ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ కుంగిపోతుంటే..మరో వైపు ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా స్పందించరా అని బిజేపీని ఉద్దేశించి అన్నారు.
ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశమంతా గమనిస్తోందనీ, నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియమాకం విషయంలో జరిగిన అనేక పరిణామాలను కూడా చూశామన్నారు.
రాజధాని విషయంలోనూ కోర్టుకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలున్నాయనీ, కానీ మీరు తీసేసుకుంటూ ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారన్నారు.
వెయ్యో, రెండు వేల కోట్లు ఖర్చుపెడితే పూర్తయ్యే రాజధానిని మార్చడం దురదృష్టకరమనీ, రాజధాని విషయంలో మీ నిర్ణయం తప్పు అనీ, ప్రజాగ్రహానికి గురికాకతప్పదని అన్నారు.
రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా రాజధాని మార్చొద్చునీ, కావాలంటే రెఫరెండం కోరండని డిమాండ్ చేశారు.