కరోనా వారియర్స్ ని నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం
పర్మినెంట్ చేస్తామని చెప్పి మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి
మునిసిపల్ కార్మికుల పట్ల వైసిపి ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య
జులై 11వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు అందించండి
సిపిఎం నగర కార్యదర్శి కత్తి. శ్రీనివాసులు
నెల్లూరు, జూలై 8 (సదా మీకోసం) :
మునిసిపల్ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా జూలై 11వ తేదీ నుండి మున్సిపల్ కార్మికులు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి వి. ఆర్.సి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రూరల్ గౌరవ అధ్యక్షులు కిన్నెర కుమార్ మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే మున్సిపల్ కార్మికుల పట్ల వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని అన్నారు. గత మూడు సంవత్సరాల నుండి అనేకమార్లు వినతులు అర్జీలతో తమ సమస్యలు విన్నవించుకున్నా ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదన్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా, పాదయాత్ర సాక్షిగా అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కి కార్మికుల సమస్యలు గాలికి వదిలేసారని అన్నారు.
గత 30 సంవత్సరాల పై నుండి పనిచేస్తున్న కార్మికుల్ని పర్మినెంట్ చేయకపోవడం సరైన చర్య కాదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్మినెంట్ చేసేంతవరకు ప్రతీ కార్మికుడికి పర్మినెంట్ ఉద్యోగికిస్తున్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
అన్ని విభాగాలలోని కార్మికులందరికీ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు నగరపాలక సంస్థలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న పోరాటంలో పాల్గొని వారికి మద్దతునందించిన సిటీ,రూరల్ ఎమ్మెల్యేలకు నేడు మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టడం లేదని అన్నారు.
నగరంలో నాలుగు సార్లు మస్టర్ల విధానం పెట్టి పారిశుధ్య కార్మికుల్ని అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని అన్నారు.
విధుల్లో చనిపోయిన కార్మికులకి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఎక్సగ్రేషియా చెల్లించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.
చనిపోయిన కార్మికుల స్థానంలో వారి వారసులను చేర్చుకోవడం లేదని అన్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్మికులు చేస్తున్న రాష్ట్రవ్యాప్త సమ్మెకు ప్రజలు,ప్రజా సంఘాలు తమ మద్దతును అందించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే పెంచల నరసయ్య, సిఐటియు రూరల్ కార్యదర్శి అల్లాడి గోపాల్, ఐద్వా నగర కార్యదర్శి షేక్ మస్తాన్ బి, డివైఎఫ్ఐ జిల్లా మరియు నగర కార్యదర్శులు రమణ, బీపీ నరసింహ, లారీ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి సిహెచ్ దామోదర్ రెడ్డి, సిఐటియు నాయకులు సుధాకర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుజాతమ్మ, వజ్రమ్మ, మహీంద్రా, చినబాబు, అశోక్, చెన్నయ్య, ఇజ్రాయిల్ మరియు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.