ఆ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించండి : ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

ఆ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించండి
అధికారులు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొన్నారు
సోమశిల ప్రాజెక్ట్ కూడా నాగార్జున సాగర్ లా వివాదాస్పదం అయ్యే ప్రమాదం
మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు ప్రతినిధి, ఫిబ్రవరి 16 (సదా మీకోసం) :
జిల్లాల పునర్విభజన పై జిల్లాలోని ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులతో చర్చించలేదని, అధికారులు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొన్నారని, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆనం నివాసంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం.రామనారాయణరెడ్డి మాట్లాడిన విషయం ఆయన మాటల్లోనే “జిల్లాల పునర్విభజన పై జిల్లాలోని ఎమ్మెల్యేలతో ,ప్రజాప్రతినిధులతో చర్చించలేదు. అధికారులు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొన్నారు, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదు. 13 జిల్లాలను 26 జిల్లాలు చేయాలన్న సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. అయితే వెంకటగిరి నియోజక వర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపటంవల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కలువాయి ,రాపూరు ,సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి. ఆమేరకు మండలాల్లో ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతున్నాము. నియోజక వర్గాల పునర్విభజనలో కూడా మూడు మండలాలకు నష్టం జరిగింది. సోమశిల ప్రాజెక్ట్ కూడా నాగార్జున సాగర్ లా వివాదాస్పదం అయ్యే ప్రమాదం ఉంది. ప్రజల ఆవేదనను అర్ధం చేసుకొని న్యాయం చేయమని కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చాము. రాజకీయ స్వార్ధంతో అప్పట్లో నియోజక వర్గాల పునర్విభజన చేసారు. ఆనం కుటుంబాన్ని దెబ్బ కొట్టేందుకే అప్పుడు అలా చేసారు. జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా చేసి సమస్య పరిష్కరించాలి. రాష్ట్ర విభజన సమయంలో తెలుగువారిని నీళ్లు ,నిధులు అంటూ విడగొట్టారు. జిల్లాల విభజన ప్రక్రియలో కూడా అదే పరిస్థితి ఉంది. మనుగడలో ఉన్న పార్టీకి, మాకు ప్రజాప్రతినిధులకు రాజకీయంగా కూడా నష్టం జరుగుతుంది. రాష్ట్ర విభజన ,నియోజక వర్గాల పునర్ విభజనలో నష్టాన్ని భరించాము, మరోమారు ఆ తప్పు చేయకూడదు. మూడో సారి కూడా నష్టం జరిగితే భరించలేము.. ప్రజల మనోభావాలు దెబ్బతింటే.. వ్యతిరేకత వస్తుంది. అధికారులు పునరాలోచించి సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలి” అని ఎమ్మెల్యే ఆనం అన్నారు.