వైసీపీ ప్రభుత్వ మొద్దు నిద్ర లేపెందుకే సాధన దీక్ష : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర

వైసీపీ ప్రభుత్వ మొద్దు నిద్ర లేపెందుకే సాధన దీక్ష : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
-: అమరావతి, జూన్ 29 (సదా మీకోసం) :-
కరోనా బాధితులను ఆదుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అమరావతిలోని టీడీపీ జాతీయ కార్యాలయం వద్ద నారా చంద్రబాబునాయుడు గారు చేపట్టిన సాధన దీక్షలో జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. కరోనా బాధితులను ఆదుకోవాలని మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎలాంటి చలనం లేదన్నారు.
అభివృద్ది చెందిన రాష్ట్రాల తో పాటు అభివృద్ధికి నోచుకోని రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం కరోనా మహమ్మారి ను ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుస్తుంటే, ఒక్క ఏపీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా వైరస్ వెళ్ళిపోతుందని , పారా సెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందని స్వయాన ముఖ్యమంత్రి గారే అవాస్తవాలు ప్రచారం చేశారని విమర్శించారు.
కరోనా వైరస్ ను ఒక కులానికి అంటగట్టేందుకు కూడా వెనుకాడని దౌర్భాగ్యమైన ప్రభుత్వం వైసీపీ దన్నారు.
కరోనా వైరస్ వస్తుంటుంది…పోతుంటుంది అంటూ ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడారని, అలా వచ్చిన వైరస్ పోతూ పోతూ వేలాది ప్రాణాలను బలి తీసుకుందని, లక్షలాది కుటుంబాలను రోడ్డు మీదకు ఈడ్చిందని విమర్శించారు.
కరోనా ను కట్టడి చేసేందుకు ఏడాదిన్నర సమయం లో ఏ ఒక్క జిల్లాలో కూడా ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెట్టింది లేదని, అధికారులను అప్రమత్తం చేసింది లేదన్నారు.
కరోనా కట్టడి కోసం బాధ్యతాయుత ప్రతిపక్ష నాయకుడు గా చంద్రబాబు గారు సూచనలు ఇస్తే వారిని అవహేళన చేయడం, దూషించడం తోనే వైసీపీ ప్రభుత్వ పెద్దలు కాలం వెళ్లదీశారన్నారు.
గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలను చైతన్య పరిచి కరోనా మహమ్మారి పట్ల అవగాహన కల్పించాల్సి ఉండగా, నిర్లక్ష్య ధోరణి తో ఈ పరిస్థితికి తీసుకు వచ్చారన్నారు.
తిత్లీ , హుదూద్ తుఫానులు, నెల్లూరు, గోదావరి వరదల సమయం లో విపత్తు ఘటనా ప్రదేశాలలో ముఖ్యమంత్రి హోదాలో స్వయాన చంద్రబాబు గారే దగ్గరుండి వసతులు పునరుద్ధరించారు. ప్రజలకు ధైర్యం చెప్పి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఏర్పాట్లు పర్యవేక్షించారన్నారు.
కరోనా బారి నుంచి రక్షణ కోసం మాస్క్ లు, మందులు అడిగినా, ప్రాణాపాయ స్థితిలో ఆక్సిజన్ బెడ్ లు అడిగిన వారిపై ఎదురు దాడి చేసిన ఘటనలు కోకొల్లలని తెలిపారు.
ఒక్క ఆసుపత్రి లో కూడా సరిపడా ఆక్సిజన్ సిలిండర్ లు లేవు , ఆక్సిజన్ సరఫరా అయ్యే పైప్ లైన్ వ్యవస్థ లు సరైనవి లేవన్నారు.
2 వేలకు దొరికే రెమిడిసివిర్ ఇంజెక్షన్ 30 నుండి 40 వేల వరకు బ్లాక్ మార్కెట్ లో అమ్ముడు పోయిన మాట వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారూ ? ఆ ఇంజెక్షన్ కంపెనీ మీ సహ ముద్దాయి, భాగస్వామి కి చెందినది కాదా అని ప్రశ్నించారు.
కరోనా వ్యాక్సిన్ లపై కులం పేరుతో వివాదాలు సృష్టించారు. వ్యాక్సిన్ లు అందించడం లో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని నిలదీస్తే పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారన్నారు.
ముందు చూపుతో 20 ఏళ్ల క్రితం చంద్రబాబు అనుమతి ఇచ్చిన కంపెనీ వ్యాక్సిన్ అందిస్తుంటే అది చంద్రబాబు బంధువుల కంపెనీ అని, వారి కులానికి చెందిన కంపెనీ అంటూ కులం ముద్ర వేస్తున్నారు, దేశంలోని ఏ రాష్ట్రం లో కూడా ఇలాంటి ఘోర పరిస్థితులు లేవన్నారు.
కేంద్రం అందించిన కరోనా వ్యాక్సిన్ ల వృథా ను బట్టి కరోనా కట్టడి లో వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ది స్పష్టం అవుతోందన్నారు.
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ల వృథా 6.5 శాతంగా , బీహార్ వంటి వెనుకబడిన రాష్టం లో 4 శాతం గా , పక్క రాష్ట్రం తమిళనాడు లో 3.7 శాతం, కేంద్ర గుప్పిట్లో తీవ్ర ఇబ్బందులకు గురి అయిన పశ్చిమ బెంగాల్ లో 4.8 శాతం గా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 11.8 శాతం వ్యాక్సిన్ లు వృథా అయ్యాయని, దీనిని బట్టి ప్రభుత్వ పనితీరు ఏ మాత్రం ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు.
వ్యాక్సిన్ ల వృథా ను కొలమానం గా తీసుకుని నేడు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు వ్యాక్సిన్ లు సరఫరా చేస్తామని చెబుతోంది. భారీ ఎత్తున వ్యాక్సిన్ లు వృథా చేసిన ఆంధ్రప్రదేశ్ కు వ్యాక్సిన్ లు ఆశించగలమా అని ప్రశ్నించారు.
తెల్ల రేషన్ కార్డుదారులకు పదివేల ఆర్థిక సాయం, కోవిడ్ మృతుల కుటుంబాలకు 10 లక్షలు, ఆక్సిజన్ మృతులకు 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
దేశంలోని 9 రాష్ట్రాలలో కరోనా ప్యాకేజీ అందిస్తున్నది వాస్తవం కాదా? ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితులకు ప్యాకేజీ ఎందుకు ఇవ్వరు? చంద్రబాబు లేఖ వ్రాస్తే ఎందుకు ఇవ్వాలనే మొండి పట్టుదల కు పోవద్దని కరోనా బాధితులకు అన్యాయం చేయవద్దని వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.