ఆరోగ్య రంగ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి : వైద్య ఆరోగ్య శాఖా మంత్రికి పంపిన ప్ర‌జారోగ్య‌వేదిక‌

0
Spread the love

ఆరోగ్య రంగ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

వైద్య ఆరోగ్య శాఖా మంత్రికి పంపిన ప్ర‌జారోగ్య‌వేదిక‌

విశాఖ‌ప‌ట్నం, ఫిబ్ర‌వ‌రి 28 (స‌దా మీకోసం) :

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జారోగ్య‌వేధిక అధ్య‌క్ష కార్య‌ద‌ర్శులు డాక్టర్ ఎం.వి. రమణయ్య, కామేశ్వరరావులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి వైద్య ఆరోగ్య శాఖ ప‌రిధిలోని స‌మ‌స్య‌లపై లేఖ పంపారు. ఈ లేఖ‌లో “ప్రజలందరికీ ఆరోగ్యం అందాలంటే ముఖ్యమైనది ఆర్థిక వనరులు ఏర్పాటని జాతీయ స్థూల ఆదాయంలో ఆరు నుంచి ఏడు శాతం కేటాయింపులు అవసరమని అనేక నివేదికలు చెప్పాయని  మీ విశాల హృదయానికి తెలియందేమి కాదు. కావున . రాబోవు బడ్జెట్ సమావేశాలలో  ఆరోగ్య రంగానికి తప్పక కేటాయింపులు  పెంచాలి. దురదృష్టవశాత్తు మన బడ్జెట్ కేటాయింపులు దరిదాపుగా ఒక శాతానికి పరిమితం కావడం చాలా బాధాకరం. 2019 – 20 బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే ఆరోగ్య రంగం కేటాయింపు 11,610 కోట్ల రూపాయలు. అంటే స్థూల ఉత్పత్తిలో(11,00,500 కోట్ల రూపాయలు) 1.05%. ఇందులో  ఖర్చు పెట్టినది 7,538 కోట్ల రూపాయలు. అంటే  రాష్ట్ర జి.డి.పిలో (SGDP) ఇది ఇది 0. 68 % మాత్రమే. అంటే కేటాయించిన నిధులను కూడా సరిగా ఉపయోగించడం లేదని తెలుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలకు మనం చాలా దూరంగా ఉన్నామని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం ఆరోగ్య రంగానికి కేటాయింపులు ఇలాగానే కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను అందుకునే అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదు. వీటిని దృష్టిలో పెట్టుకొని  ఆరోగ్య రంగానికి జీడీపీలో కనీసం మూడు శాతం కేటాయింపులు ఉండాలని, కేటాయించిన బడ్జెట్ను తప్పక వినియోగించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. అలాగే రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయడమే కాక వారి  భౌగోళిక పరిస్థితులను, ఆహార వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని వైద్యశాలలను, వైద్యులను మరియు వైద్యేతర సిబ్బందిని కేటాయించాలి.

ప్రస్తుతం బడ్జెట్ కేటాయింపులను మూడు నెలలకు  ఒక పర్యాయం విడుదల చేయడం జరుగుతుంది. ఇలా చేయడం కారణంగా విపత్కర పరిస్థితులలో అవసరమైన అత్యవసర మందులు మరియు పరికరాలు కొనుగోలుకు చాలా ఇబ్బందిగా ఉంది. అలాకాకుండా నెలకు ఒక పర్యాయం కావలసిన మొత్తాన్ని  విడుదల చేస్తే బాగుంటుంది. 

    ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజల అవసరాలకు సరిపడా వైద్య పరికరాలు, వైద్య మరియు వైద్యేతర  సిబ్బంది నియామకాలపై  కేంద్రీకరించ వలసిన అవసరం  చాలా ఉంది. జాతీయ వైద్య మండలి విధి విధానాల ప్రకారం ప్రతి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో తప్పక అత్యవసర వైద్య విభాగం ఉండాలి. చాలా మెడికల్ కాలేజీ ఆసుపత్రులలో  ఈ వసతి లేదు. గవర్నమెంట్ తక్షణమే స్పందించి  ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లను ఏర్పాటు చేయడం, అందుకు కావలసిన సిబ్బందిని, పరికరాలను ఏర్పాటు చేయడం మరియు నిధులను కేటాయించడం చేయాలి. అలా జరగని పక్షంలో వైద్య కళాశాలల గుర్తింపు రద్దు జరిగే అవకాశం ఉంది ఆ కారణంగా ఆ కాలేజీలలో , డిపార్ట్మెంట్లలో పీజీ సీట్ల ను రద్దు చేసే అవకాశం కూడా ఉంది.

ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీలే కాకుండా మరో 16 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ప్రజారోగ్య వేదిక అభినందిస్తుంది.. ఈ అన్ని కాలేజీలలో , వైద్యశాలలో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని కూడా అందుబాటు చేయడం చాలా అవసరం.అలా చేయగలిగితే కిడ్నీ, క్యాన్సర్, గుండె జబ్బులు లకు వైద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చి మన వైద్య రంగం ముందుకు పోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికీ ఉన్న 11 మెడికల్ కాలేజి ఆస్పత్రులు డాక్టర్లు, మరియు వైద్య సిబ్బంది పరికరాల కొరతను ఎదుర్కొంటున్నాయి. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మిగిలిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో కూడా కావలసిన పరికరాలు వైద్య మరియు వైద్య సిబ్బందిని సరియైన మోతాదులో అందుబాటు చేయడం అన్నది కూడా చాలా అవసరం. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి.

వైద్యరంగంలో మరో కీలకమైనటువంటి అంశం పరిశోధన కేంద్రాలు.
ICMR,CCMB,DRDO,NIN లాంటి  పరిశోధన కేంద్రాలు అన్నీ రాష్ట్ర విభజన లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇటువంటి పరిశోధన కేంద్రాలు ఏమీ లేవు. ఇవి లేని కారణంగా భవిష్యత్తులో ఆరోగ్య రంగం పై చాలా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. వ్యాధి మూలాలను కనుగొనడానికి ఈ పరిశోధనా కేంద్రాల అవసరం చాలా ఉంది. కావున భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పరిశోధనా కేంద్రాలను మన రాష్ట్రంలో వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది.ఈ కేంద్రాల ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వంపై  ఒత్తిడి తెచ్చి నెలకొల్పాలి.

రాష్ట్ర విభజనలో భాగంగా యన్. ఎం. జె (NMJ) క్యాన్సర్ ఆస్పత్రి, నీలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రి లాంటి  ప్రత్యేక వైద్యశాలలు  తెలంగాణ రాష్ట్రంలోనే ఉండిపోయాయి. ఇటువంటి ప్రత్యేక ఆసుపత్రులను ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి ఆస్పత్రులను మన రాష్ట్రంలో కూడా వెంటనే ఏర్పాటు చేయాలి.
మందులను వైద్యశాలలకు  మూడు నెలలకు ఒక పర్యాయం సరఫరా చేస్తున్నారు. దీనివలన మందులు సరైన సమయంలో అందక రోగులు ఇబ్బంది పడుతున్నా రు. ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి  అలా కాకుండా ప్రతి నెల వైద్యశాలకు మందులు అందించడం  జరగాలి. ఈ మందుల పంపకంలో స్థానిక వైద్య  సమస్యలను దృష్టిలో ఉంచుకొని,వ్యాధుల తీవ్రతను, ఆ ప్రాంతంలో వచ్చిన వైద్య విపత్తులను కూడా పరిగణలోకి  తీసుకుని  నెలవారీగా కావలసిన మందులను ప్రతి నెల అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రోగులకు మందులు లేని కారణంగా ప్రాణహాని జరగకూడదు అని మీకు తెలియజేసుకుంటున్నాము.

విశాఖపట్టణంలో ఏర్పాటుచేసిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(VIMS) సంస్థను నిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIMS) స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పిన మాట ఆచరణలో జరగడం లేదు. ఈ సంస్థను 2016 లో ప్రారంభించినా  ఇప్పటికీ దానికి ఉండవలసినటువంటి ప్రమాణాలకు అనుగుణంగా పరికరాలను, సిబ్బందిని, వైద్య విభాగాలను సంపూర్ణంగా ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం. ఈ సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుకుంటున్నాం.

       రక్షిత మంచి నీరు, కాలుష్య రహిత వాతావరణం లేకపోవడం లాంటి అంశాలు కూడా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నది మీకు తెలియని విషయం కాదు. రాష్ట్ర ప్రజలందరికీ రక్షిత మంచి నీరు , కాలుష్యరహిత వాతావరణాన్ని అందించడం  ద్వారా ప్రజలను  అనేక వ్యాధుల నుంచి విముక్తి చేయవచ్చు . పౌష్టికాహార లోపంతో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండి సాధారణ ప్రజానీకం అనేక జబ్బులతో బాధపడుతున్న కారణంగా సాధారణ ప్రజలకు నెలవారీగా బియ్యం అందించడం చాలా మంచి కార్యక్రమం. ఈ బియ్యం తో పాటు ప్రజలలో రోగ నిరోధక శక్తి పెరిగే రకంగా కందిపప్పు, మినప పప్పు, బెల్లం లాంటి  సరుకులను కూడా అందించగలిగితే  అనేక వ్యాధుల నుంచి తప్పుకోవడానికి మరియు త్వరగా కోలుకోవడానికి  ఎంతో ఉపయోగపడుతుందని మీకు తెలియజేసుకుంటున్నాము.
    భారత వైద్య రంగంలో ప్రామాణికంగా ఉన్న సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అర్బన్ హెల్త్ సెంటర్ ల సంఖ్యను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేసి  అందుకు అవసరమైన నిర్మాణాలు, డాక్టర్లు, వైద్య మరియు వైద్యేతర సిబ్బందిని, మందులు, పరికరాలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేయాలి. దీనివలన సెకండరీ మరియు టెర్షియరి వైద్యానికి కేంద్రాలైన జిల్లా ఆసుపత్రులపై వత్తిడి తగ్గి మంచి వైద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
     మన రాష్ట్రంలో లో దాదాపుగా 60 నుంచి 70 శాతం వైద్య సదుపాయాలు ప్రైవేట్ రంగం చేతుల్లోనే ఉన్నాయి. ఈ ప్రవేట్  వైద్యాన్ని అందుకోవడం సాధారణ ప్రజానీకానికి కష్టసాధ్యంగా ఉంది. ఈ ప్రైవేటు వైద్య రంగంలో వసూలు చేస్తున్న అధిక ఫీజులను సాధారణ ప్రజానీకం తట్టుకునే పరిస్థితి లేదు. ఈ ఫీజు వసూళ్లపై  ఉన్న నిబంధనలు అమలు కావడం లేదు. కోవిడ్ -19 రెండవ వేవ్ లో ప్రైవేటు యాజమాన్యాలు అత్యంత దుర్మార్గంగా ప్రజల నుండి ఫీజులు వసూలు చేశారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలి.  అందుకనే ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ప్రైవేటు వైద్య రంగం వసూలు చేస్తున్న ఫీజులు మీద ప్రభుత్వ అజమాయిషీ, నియంత్రణ ఉండే విధంగా చూడాలని కోరుకుంటున్నాం.
         పై సూచనలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా అవసరమైన ఆరోగ్య బడ్జెట్ ను మూడు శాతానికి పెంచే విధంగా ఆర్థిక శాఖను ఒప్పించి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యం మెరుగుపడే విధంగా చూడాలని ప్రజారోగ్య వేదిక మిమ్మల్ని కోరుకుంటుంది” అని ఆ లేఖ‌లో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!