జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలి : జెడ్పి చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలి
జెడ్పి చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
నెల్లూరు జడ్పీ, మార్చి 26 (సదా మీకోసం) :
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి, జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని జెడ్పి చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పిలుపునిచ్చారు.
శనివారం నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ పాలకమండలి సమావేశం ప్రారంభం కాగా జడ్పీ సీఈవో శ్రీనివాస రావు సభను కొనసాగించారు.
ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, జెడ్పిటిసి, ఎంపీపీ సభ్యులు సూచించిన పలు సమస్యలపై జెడ్పి చైర్పర్సన్ అరుణమ్మ, జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు చర్చించారు.
ముందుగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇటీవల మృతి చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పొదలకూరు ఎంపీపీ నిమ్మల విజయమ్మ ఆత్మశాంతికి మౌనం పాటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ జడ్పీటీసీలు, ఎంపీపీలు తమ మండల పరిధిలోని గ్రామాల్లో అధికారుల సహకారంతో సమన్వయంగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు అందేలా చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం శాఖల వారీగా సమీక్షించారు. ముందుగా మత్స్యశాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆయా శాఖల అధికారులు సభకు వివరించారు.
సభలో ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లు, 22ఎ, చుక్కల భూముల సమస్య, జగనన్న ఇళ్ల నిర్మాణాలు, అటవీ భూముల్లో ఇసుక, గ్రావెల్ తరలింపు, కలువాయి ఫిషర్మెన్ కోపరేటివ్ సొసైటీ తదితర అంశాలపై చర్చించారు.
నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ పరిధిలోని వావిలేటిపాడు జగనన్న లేఅవుట్ ను త్వరగా చదును చేసి పనులు ప్రారంభించాలని కోరారు.
సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మనుబోలు మండలం వడ్లపూడి గ్రామ రిజర్వ్ ఫారెస్ట్ నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని, అటవీశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, రైతు భరోసా కేంద్రాలు నుంచి మిల్లులకు పంపించిన ధాన్యాన్ని దించుకోవడం లేదని, ఒక బస్తా కు 9 కిలోలు అదనంగా ధాన్యం ఇస్తేనే లారీలోని బస్తాలను దించుకుంటున్నారని, ఈ విషయమై అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.
కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన లెవలింగ్ పనులు చేపట్టాలని, త్వరగా బిల్లులు మంజూరు చేయాలని కోరారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే రైతులకు చెల్లించాల్సిన పాత బకాయిలు రూ. 128 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుందని, ఇప్పుడు సేకరిస్తున్న ధాన్యానికి కూడా త్వరగా నగదు చెల్లించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
అలాగే ఏప్రిల్ 1 నుంచి జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు జమ అవుతాయని చెప్పారు.
సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎన్డిసిసి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ దొంతు శారద, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) కుమారి జాహ్నవి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) రోజ్ మాండ్, సివిల్ సప్లైస్ డి ఎం పద్మ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ ఎస్ఈలు సుబ్రహ్మణ్యం, మేడా శ్రీనివాస్ కుమార్, రామాంజనేయులు, కృష్ణ మోహన్, డి ఎం హెచ్ ఓ రాజ్యలక్ష్మి, వ్యవసాయ శాఖ జె.డి ఆనంద కుమారి, మత్స్యశాఖ జె.డి నాగేశ్వర రావు, డి ఆర్ డి ఎ, డ్వామా, మెప్మా పీడీ లు సాంబశివ రెడ్డి, తిరుపతయ్య, రవీంద్ర, డి పి ఓ ధనలక్ష్మి, డి ఈ ఓ సి రమేష్ ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.