కామ్రేడ్ జక్కా వెంకయ్య నేటి తరాలకు ఆదర్శప్రాయుడు

కామ్రేడ్ “జక్కా వెంకయ్య నేటి తరాలకు ఆదర్శప్రాయుడు
సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి చంద్రారెడ్డి
నెల్లూరు రూరల్, మే 29 (సదా మీకోసం) :
భూపోరాటాల సారధి, నెల్లూరు జిల్లా మార్క్సిస్టు ఉద్యమ నిర్మాత, కార్మిక, కర్షక, పీడిత ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ “జక్కా వెంకయ్య నేటి తరాలకు ఆదర్శప్రాయుడని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి చంద్రారెడ్డి అన్నారు.
ఆదివారం జక్కా వెంకయ్య గారి 4వ వర్ధంతి సందర్భంగా జక్కా వెంకన్న కుటుంబ సభ్యుల సహకారంతో వేదాయపాళెం ప్రగతి ఛారిటీస్ లోని అనాథ బాలలు, మానసిక వికలాంగులకు పౌష్టికాహారం, నిత్యావసర సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగం, పేదల కోసమే పుట్టిన మహోన్నత వ్యక్తి జక్కా వెంకయ్య అని అన్నారు. ఎటువంటి పరిస్థితులకైనా ఎదురొడ్డి ధీరోదాత్తంగా పోరాడగలిగే శక్తి కలిగిన నాయకుడు జక్కా వెంకయ్య అని కొనియాడారు.
జమిందారి వంశంలో జన్మించిన జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన జక్కా వెంకయ్య భావితరాలకు స్ఫూర్తి ప్రదాత అని అన్నారు.
తాను తిన్నా తినకపోయినా పక్కనున్న వారి అవసరాలు తీర్చిన తర్వాతే తన గురించి ఆలోచించే తత్వం ఆయనలోని గొప్పలక్షణమని, రెండు సార్లు శాసన సభ్యుడిగా పనిచేసిన ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై నిర్విరామంగా పోరాటాలు నిర్వహించారని అటువంటి మహనీయుని వర్ధంతి సందర్భంగా సేవా సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నేటి తరం యువత కృషి చేయాలని అన్నారు.
కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి దయాకర్, నగర కమిటీ సభ్యులు ఎ శ్రీనివాసులు, నాయకులు క్రాంతి, సూరి పాల్గొన్నారు.