అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరవలేనిది : జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరవలేనిది
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
నెల్లూరు నగరం, నవంబర్ 1 (సదా మీకోసం) :
భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధనకోసం అహర్నిశలు కృషిచేసి అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరవలేనిదని, వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై వుందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు.
మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర కస్తూర్భా కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ బాబు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు నగరం మేయర్ పోట్లూరి స్రవంతి, శాసన మండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డి, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, నెల్లూరు నగర పాలక సంస్థ కమీషనర్ హరిత, ట్రైనీ కలెక్టర్ విద్యాధరి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, ఆర్. డి. ఓ మలోల తో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సంధర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని, వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందన్నారు.
ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని అన్నారు.
ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు కారకులైనారని అరుణమ్మ తెలిపారు.
మహాత్మా గాంధీ గారు బోధించిన సత్యం, అహింస ఆశయ సాధన కోసం అమర జీవి పొట్టి శ్రీరాములు అహర్నిశలు కృషిచేశారని, ఆ మహనీయుల సేవలను మనమంతా మనసారా స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులు ఆర్పిద్దాం అని ఆనం అరుణమ్మ అన్నారు.
జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, విద్యార్థిని విద్యార్థులకు, అధికారులకు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానన్నారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ఎందరో మహానుభావులు పోరాడారన్నారు.
తెలుగు భాష కోసం తెలుగు ప్రజల కోసం ఆంధ్రరాష్ట్ర ఆవిర్బావానికి ప్రాణత్యాగం చేసిన గౌరవ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన జిల్లా వాసులు కావడం మనకెంతో గర్వకారణమన్నారు.
మనుషులందరిని కలుపడానికి భాష ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుందని సూచించి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన కారణభూతులైనారు. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఏర్పడినా ఎన్నో భాషలు, వ్యవహారాలు, ఆచారాలు, కులాలు, మతాలు వున్న మనమంతా భారతీయులం అని అన్నారు.
రాష్ట్రాల ఏర్పాటు అనేది పరిపాలనా సౌలభ్యం కోసమేనని, ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితమే నేడు స్వాతంత్ర్య ఫలాలను దేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ స్వీకరిస్తున్నారన్నారు.
మన దేశ సుపరిపాలనను ఆదర్శంగా తీసుకొని ఎన్నో దేశాలు పరిపాలన సాగిస్తున్నాయన్నారు.
ఎంతో జనాభా కలిగిన మనదేశ ఎన్నికల ప్రక్రియను ఇతర దేశాలు ఆసక్తిగా గమనించడంతో పాటు ఆచరించడం కూడా జరుగుచున్నదన్నారు.
రాష్ట్రం అన్నీ రంగాల్లో అభివృద్ది చెంది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని, ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్దికి పాటుపడాలన్నారు.
మన రాష్ట్రంలో సముద్ర తీరంతో పాటు ఎన్నో పారిశ్రామిక వాడలు, పోర్టులు కలిగి వుండటంతో పాటు ఎంతో ఖనిజ సంపద ఉందని, ఉన్న వనరులను, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి పాటుపడేలా ముఖ్యంగా యువత ముందుకు రావాల్సివుందన్నారు.
దేశం పట్ల భక్తి, గౌరవం, శ్రద్దతో మెలుగుతూ, దేశం గౌరవించేలా ప్రతి ఒక్కరూ మెలగాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
నెల్లూరు నగరం మేయర్ పోట్లూరి స్రవంతి మాట్లాడుతూ, అనేక పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఎందరో అసువులు బాసి అమరజీవులైనారని, వారిలో అమరజీవి పొట్టి శ్రీరాములు ముఖ్యులన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుచున్నవని అన్నారు.
శాసన మండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్ నేటి యువతపై ఆధారపడివుందన్నారు.
నేడు రాష్ట్రంలో సముద్ర తీరంతో పాటు అనేక పోర్టులు, హర్బర్స్ వున్నాయని, వున్న వనరులను సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ది పధంలోకి తీసుకురావడానికి, రాష్ట్రాభివృద్దిలో యువత భాగస్వాములు కావాలన్నారు.
అనంతరం స్వాతంత్ర్య సమరయోధులు కె.వి. చలమయ్య ను, అమరజీవి పొట్టి శ్రీరాములు గారిపై గేయం పాడిన కృష్ణ స్వామి ని ప్రత్యేకంగా సత్కరించారు.
ఈ సంధర్భంగా ప్రదర్శించిన సంగీత నృత్య కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా దింసా నృత్యం మరియు నెల్లూరు జడ్.పి హై స్కూల్ హింది ఉపాధ్యాయురాలు సుధావాణి ప్రదర్శించిన ముద్దుగారే యశోధా అనే నృత్యం ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్ సుధాకర్, జడ్పీ సి.ఈ. ఓ చిరంజీవి, డి.ఆర్.డి.ఏ, డ్వామా పి.డి లు సాంబశివారెడ్డి, వెంకట్రావు, డి.పి.ఓ ధనలక్ష్మి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి కనక దుర్గా భవాని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, డిఇఓ రమేష్, డిటిసి బి. చందర్, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ.లు సుబ్రమణ్యం, రంగ ప్రసాద్, విద్యార్ధిని విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.