వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ని జగన్ ఎత్తేసాడు : కేతంరెడ్డి

వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ని జగన్ ఎత్తేసాడు

జగనన్న విద్యాదీవెన కాదది విద్యార్థుల పాలిట జగనన్న భస్మాసుర హస్తం

పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఆవేదన చెందిన పలువురు ప్రజలు

నెల్లూరు న‌గ‌రం, జూన్ 3 (స‌దా మీకోసం) :-

నెల్లూరు న‌గ‌ర‌ నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 18వ రోజుకి చేరింది.

18వ రోజున స్థానిక 3వ మైలు సెంటర్, నవలాకులతోట ప్రాంతాలలో ప్రతి ఇంటికి వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఓ మహిళా తల్లి తన కుమారులకు జగన్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఎలా తొలగించారో వివరిస్తూ ఆవేదన చెందింది.

తన పెద్ద కుమారుడు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడని, ఏడాదికి 75 వేల రూపాయలు ఫీజు అవుతోందని, జగన్ వస్తే మొత్తం ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్తే నమ్మి తమ బిడ్డను ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్ చేర్పించామని, రెండేళ్ల పాటు వచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ తమకు సొంత ఇల్లు ఉందనే కారణాన్ని చూపి తొలగించారని ఆవేదన చెందింది.

కాయా కష్టం చేసి ఒక ఇల్లు కట్టుకోవడం తాము చేసిన పాపమా అని, ఇల్లు చూస్తున్నారు కానీ ఇంట్లో బాధలను, కష్టాలను మాత్రం జగన్ ప్రభుత్వం చూడట్లేదని వాపోయారు.

పెద్ద కొడుక్కి మరో రెండేళ్లకు ఒకటిన్నర లక్ష ఫీజు కట్టాలని, రెండో కొడుక్కి ఇంజనీరింగ్ అంటే ఇష్టం ఉన్నా కూడా చేర్పించలేక డిగ్రీ చేర్చాల్సి వచ్చిందని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

గతంలో రేషన్ కార్డు ఆధారంగా, ఇన్ కం సర్టిఫికేట్ ఆధారంగా ఫీజు రీయింబర్స్ మెంట్ ను మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారని, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక పెరిగిన ఫీజులకు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోయినా వైఎస్ఆర్ విధానాల్లో మార్పులు తేలేదని, కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన తండ్రి ఆశయాలకు తూట్లు పొడుస్తూ రకరకాల కారణాలు చూపి ఫీజు రీయింబర్స్ మెంట్ ఎత్తేశారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు.

పీజీ చదివే విద్యార్థులకు కూడా పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఎత్తేశారని, ఎత్తేసిన పథకానికి జగనన్న విద్యా దీవెన అని పేరు పెట్టారని, అసలు ఇది దీవెన కాదని విద్యార్థుల నెత్తిన జగనన్న భస్మాసుర హస్తం అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఎద్దేవా చేసారు.

పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించి జనసేన పార్టీకి అవకాశం కల్పించాలని, పవనన్న ప్రభుత్వంలో విద్యార్థుల విషయంలో ఇలాంటి దుర్మార్గ చర్యలు ఉండవని, విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి సుభిక్షంగా చూస్తారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలకు వివరించారు.

కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!