CM Sir : ముఖ్యమంత్రి గారు….బస్సుల పై దుమ్ము తుడిచి పెడతాం, బస్ పాస్ సొమ్ము తగ్గించి పెడతారా ?
CM Sir : ముఖ్యమంత్రి గారు….బస్సుల పై దుమ్ము తుడిచి పెడతాం, బస్ పాస్ సొమ్ము తగ్గించి పెడతారా ?
షేక్. అమ్రుల్లా, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు
నెల్లూరు విద్య, జూలై 31 (సదా మీకోసం)
విద్యార్థుల బస్సు పాస్ ల చార్జీల పెంపు ను నిరసిస్తూ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు షేక్.అమ్రుల్లా ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులను నీళ్ళు, తడి గుడ్డలతో శుభ్రంగా తుడిచి పెరిగిన బస్సు పాస్ చార్జీలను వాటి కింద మినహాయించుకోవాలని కోరుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు షేక్. అమ్రుల్లా మాట్లాడుతూ, కళాశాలకు వెళ్లి చదువుకునే పేద విద్యార్థుల బస్ పాస్ చార్జీలను ఒకేసారి 50 శాతం పెంచిన విద్యార్థి కంటక ప్రభుత్వం గా వైసీపీ చరిత్ర లో నిలిచిపోతుంది.
55 కి.మీ. సగటు దూరానికి రూ.490/- ఉండే బస్ పాస్ ను రూ.735/- కు అంటే 245 రూపాయలను ఒకేసారి పెంచిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది.
వైసిపి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా బస్సు పాస్ చార్జీలను పెంచుకుంటూ పోతోంది. బస్సుల పై దుమ్ము తుడిచి, శుభ్రపరచగా వచ్చిన సొమ్ముతో పెరిగిన బస్సు పాస్ చార్జీలను చెల్లించడం తప్ప విద్యార్థులకు మరో గత్యంతరం లేదు.
ఆర్టీసీ బస్ పాస్ లపై ఆధారపడి కళాశాలలకు రాకపోకలు సాగించే విద్యార్థులు సంపన్న వర్గానికి చెందిన వారన్న భ్రమల్లో వైసీపీ ప్రభుత్వం ఉందన్న సందేహం కలుగుతోంది. వారంతా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులనే సత్యం వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలి.
జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది కళాశాల విద్యార్థులు ఆర్టీసీ బస్సులపై, బస్సు పాసులపై, విద్యార్థులకు ప్రభుత్వం అందించే రాయితీలపై ఆధారపడి ప్రయాణాలు సాగిస్తున్నారు. బస్సు పాస్ చార్జీల పెంపు వీరి పాలిట పెను భారం గా మారింది.
జీవో నెంబర్ 117 ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు, పాఠశాల విద్యార్థులకు మధ్య దూరం పెంచి ఇబ్బందులు పెడుతున్న జగన్ మోహన్ రెడ్డి గారు, నేడు బస్సు పాస్ చార్జీల పెంపు ద్వారా కళాశాల విద్యార్థులను కళాశాల విద్య కు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పెంచిన కారణంగానే విద్యార్థుల బస్సు పాస్ చార్జీలు రెట్టింపు అయ్యాయి.
నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో, 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏనాడు బస్సు పాస్ చార్జీలను పెంచింది లేదు.
తమది విద్యార్థి పక్షపాత ప్రభుత్వమని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు పాస్ చార్జీల ను అమాంతంగా పెంచి విద్యార్థుల నడ్డి విరుస్తున్నారు.
విద్యార్థుల పాలిట మేనమామగా తనని తాను గొప్పగా పరిచయం చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారు తనలో దాగిన కంస మామ అవతారాన్ని బస్సు పాస్ చార్జీల పెంపు ద్వారా మరోమారు విద్యార్థులకు చూపుతున్నారు.
బస్సు పాస్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వైసిపి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో విద్యార్థులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరిస్తున్నాం.
పై కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి కార్తీక్ రెడ్డి, నాయకులు షేక్. వసీం, రమేష్, కిరణ్, నరేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.