కోట్లాది రూపాయల గ్రావెల్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే అక్రమకేసులు
కోట్లాది రూపాయల గ్రావెల్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే అక్రమకేసులు
- రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చారని అక్రమ కేసులతో వేధిస్తే పోలీసులపై న్యాయపోరాటం
- గ్రావెల్ కుంభకోణంలో నిష్పక్షపాతమైన విచారణ కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టును ఆశ్రయించబోతున్నాం
- నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్అజీజ్
-: నెల్లూరు, జూన్ 28 (సదా మీకోసం) :-
టీడీపీ నాయకులపై అక్రమ కేసులను బనాయించడంపై నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డితో అయిన అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, నెల్లూరు సిటీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బొమ్మి సురేంద్ర, జెన్ని రమణయ్య, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు బద్దెపూడి రవీంద్ర, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు రావూరి రాధాక్రిష్ణమ నాయుడు, నాయకులు ఒట్టూరు సంపత్ రాజు, సాబీర్ ఖాన్, జలదంకి సుధాకర్ తదితరులు భేటీ అయ్యారు.
సర్వేపల్లి రిజర్వాయర్, కంటేపల్లి అటవీ భూముల నుంచి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వి తరలించేస్తున్నారు.రిజర్వాయర్ లో ఇచ్చిన అనుమతుల కన్నా పదివేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అదనంగా ఎత్తేశారని ఇరిగేషన్ ఈఈనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్అజీజ్ మాట్లాడుతూ… ఈ మైనింగ్ మాఫియా, వారిపై నమోదైన కేసుల గురించి పట్టించుకున్న నాథులు లేరని, కంటేపల్లిలోని అటవీభూముల్లో విచ్చలవిడిగా తవ్వుతుంటే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారనీ, దాని సంగతి ఏం చేశారో తెలియదన్నారు.
అసలు విషయాన్ని దారి మళ్లించడానికి గ్రామస్తులపైన అక్రమ అట్రాసిటీ కేసులు బనాయించారని, రాజకీయ కుట్రలో భాగంగానే ఈ అక్రమ కేసులని విమర్శించారు.
గ్రావెల్ కుంభకోణంలో వైసీపీ నేతల అసలు రూపం బట్టబయలుకావడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్రయత్నాలనీ, టీడీపీ నాయకుడు గుమ్మడి రాజాయాదవ్ పై పోలీసులు కేసు బనాయించారన్నారు.
దళితుడిపై దాడి చేసి దూషించిన వైసీపీ నేత ప్రదీప్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదును ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
బాధితుడైన గాలి శాంతయ్య కేసు పెడితే పోలీసులు తీసుకోలేదని, చివరకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారన్నారు.
ఆ కేసును ఏం చేస్తారోనని, అక్రమాలను పరిశీలించి ప్రశ్నించిన మా నాయకులను మాత్రం అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారన్నారు.
జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా… ఇలాంటి అరాచకాన్ని ఎన్నడూ చూడలేదని, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ అడవులకు పంపేసి ప్రజలను, వారి సొత్తును దోచేసుకోండి..అప్పుడు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్లెవరూ ఉండరని విమర్శించారు.
కంటేపల్లిలో 19 టిప్పర్లు, 4 ప్రొక్లెయిన్లు అడ్డంగా దొరికితే వారిని వదిలేశారనీ, రిజర్వాయరులో ఇరిగేషన్ ఈఈ 5 ప్రొక్లెయిన్లు, 50 టిప్పర్లను తప్పిస్తే పట్టించుకోరు.. అట్రాసిటీ కేసు పెట్టి వీటన్నింటిని దారి మళ్లిస్తారా అని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు ఏ అధికారిపైనా వ్యక్తిగతంగా పోలేదని, ఇంత ఘోరంగా, పట్టపగలు అన్యాయం చేస్తుంటే మాత్రం సహించబోమని, గ్రావెల్ కుంభకోణంపై నిష్పక్షపాత విచారణకు కమిషన్ ఏర్పాటు చేయమని హైకోర్టును ఆశ్రయించబోతున్నామని తెలిపారు.
ఇప్పటి వరకు ఎంతో కొంత న్యాయం చేస్తారని అధికారులను నమ్మామనీ, కానీ ఇకపై నమ్మబోమని, దొంగతనం చేసిన వారిని వదిలిపెట్టి చెరువులోకి వెళ్లిన గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయించి ఆ విషయాన్ని వివాదాస్పదం చేయడం తగదన్నారు.
ఈ విషయంలో న్యాయం జరగకపోతే పోలీసు అధికారులపై న్యాయ పోరాటం తప్పదన్నారు.
ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ… సర్వేపల్లి రిజర్వాయర్ లో జరిగింది ఒకటైతే, కేసులు పెట్టింది మాత్రం మరో విధంగా ఉందని, మీ అక్రమాల్ని కప్పించుకునేందుకు మా దళితులను వాడుకుంటారా అని ప్రశ్నించారు.
గ్రావెల్ అక్రమంగా తవ్వేసిన విషయంపై నమోదైన కేసులను వదిలేసి ఎస్సీలతో కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసమని, మమ్మల్ని ఇలా ఎంతకాలం వాడుకుంటారనీ, రక్షించాల్సిన పోలీసులే అక్రమ కేసులను ప్రోత్సహించి అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరమన్నారు.
ఎస్సీలను ఈ విధంగా అక్రమ కేసుల కోసం వినియోగించుకోవడం పోలీసులకు, వైసీపీ నేతలకు తగదనీ, రాజకీయ నాయకులు తమ లబ్ధి కోసం చేసే కుట్రలకు ఏ పార్టీలోని ఎస్సీలు కూడా మోసపోవద్దని కోరుతున్నానన్నారు.