వైసీపీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం లేదా?
- మంత్రి గుడివాడ అమర్నాథ్ మాటలకి ఖండన
- మద్యం దుకాణాలు, బార్లు దశలవారీగా తొలగించి కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలోనే అమ్ముతాం అని సీఎం చెప్పలేదా?
- ఇప్పుడు దశలవారీగా తెరుస్తున్న వీధికొక ఎలైట్ దుకాణాన్ని, బార్ ని ప్రజలు ఫైవ్ స్టార్ హోటల్ గా భావించాలా?
- పవనన్న ప్రజాబాటలో ప్రశ్నించిన జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు నగరం, జూలై 31 (సదా మీకోసం) :
నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరాటం కంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 76వ రోజున మూలాపేట ఆంజనేయస్వామి గుడి ప్రాంతం, కోనేటిమిట్టలో జరిగింది.
ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించి సమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మద్యనిషేధమే లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడడాన్ని సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.
ఎన్నికల ముందు ఇష్టప్రకారం హామీలు ఇచ్చేసి, ఇప్పుడు నిస్సిగ్గుగా మాటలు మార్చడాన్ని ఎలాంటి రాజకీయంతో పోల్చాలని అన్నారు.
వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మద్యపాన నిషేధం గురించి స్పష్టంగా ఉందని, ఆనాటి పాదయాత్రలో కూడా సీఎం జగన్ రెడ్డి ప్రతి ప్రాంతంలో మద్యపాన నిషేధం గురించి హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
సీఎం అయిన తొలినాళ్ళలో దశల వారీగా మద్యం దుకాణాలను, బార్లను పూర్తిగా తొలగించి కేవలం ఫైవ్ స్టార్ హోటళ్ల వరకే మద్యాన్ని పరిమితం చేస్తామని జగన్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలెవ్వరూ మర్చిపోలేదని అన్నారు.
బహుశా ఇప్పుడు తెరుస్తున్న వీధికొక ఎలైట్ షాపుని, బార్ ని ప్రజలందరూ ఫైవ్ స్టార్ హోటళ్ళుగా భావించాలా అని కేతంరెడ్డి ఎద్దేవా చేశారు.
కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.