మార్చి 28, 29 సమ్మెని జయప్రదం చేయండి : సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు
మార్చి 28, 29 సమ్మెని జయప్రదం చేయండి
సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు
ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి
-: నెల్లూరు మార్చి 20 (సదా మీకోసం) :-
ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఈ నెల 28, 29 తేదీలలో జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను చేయాలని సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ. శ్రీనివాసులు, జి. నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు.
ఆదివారం నెల్లూరు నగరం లోని ఆటో వర్కర్స్ యూనియన్, సంతపేట హమాలీ వర్కర్స్, పప్పుల వీధి హమాలీ వర్కర్స్ యూనియన్ల జనరల్ బాడీ సమావేశాలు జరిగాయి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి గర్వకారణమైన ప్రభుత్వరంగ సంస్థలను సహజ సంపదలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని విమర్శించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కార్పోరేట్ల సేవలో మునిగి తేలుతున్నదని అన్నారు.
దేశంలో కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదని దీని ప్రభావం దేశంలోని ప్రతి కుటుంబంపై పడిందని, ఇటువంటి తరుణంలో ప్రజలను ఆదుకునే చర్యలు చేపట్టకపోగా వారిపై భారాలు మోపే చర్యలకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు.
బ్రిటీష్ వలస పాలకులపై పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్స్ గా మార్చడం ద్వారా కార్మికులను యజమానుల కింద బానిసలుగా చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు.
జి.యస్.టి, నోట్లరద్దు కారణంగా వ్యాపారాలు కోలుకోని దెబ్బ తిన్నాయని, ముందుచూపు లేకుండా విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నా ప్రభుత్వం ఆదుకోలేదని, కష్టకాలంలో ప్రజలను ఆదుకునే చర్యలు చేపట్టకపోగా దేశ సంపదను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతూ చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించేందుకు చేసిన ప్రయత్నాన్ని దేశ రైతాంగం వీరోచితంగా పోరాడి తిప్పి కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే అని, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలతో దేశ సంపదను దుందుడుకుగా విదేశీ, స్వదేశీ కార్పోరేట్లకు అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు, తిప్పికొట్టాలని, కార్మిక చట్టాలను హరించేందుకు తెచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయించేందుకు, ప్రజలను రక్షించేందుకు, నూతన మోటారు వాహన చట్టాన్ని రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికుల రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టం తేవాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని, విశాఖ ఉక్కు, శ్రీ దామోదరం సంజీవయ్య జెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 2022 మార్చి 28, 29 తేదీలలో రెండురోజులపాటు జరగనున్న సార్వత్రిక సమ్మెను ప్రజలు, కార్మికులు, ప్రజాతంత్రవాదులు ఐక్యంగా కదిలి జయప్రదం చేయాలని వారు పిలుపు నిచ్చారు.
సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు, సీఐటీయూ నెల్లూరు నగర కమిటీ సభ్యులు జి.జయరామ్, సిహెచ్. దామోదర్ రెడ్డి, జీ. గోపాలయ్య, ఎం. సుధాకర్, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, రత్తయ్య, సంతపేట హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కె రవికుమార్, నర్మాల వెంకటేశ్వర్లు, ఆటో వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు కె. పెంచలయ్య, నాయకులు నాగూర్, మాధవరెడ్డి, అబిీబ సునీల్, రమేష్, మజ్జిగ బాబు, హనీఫ్, మురళి, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.