చెప్పింది చేయలేదని కలెక్టర్‌ని సెలవుపై పంపారు, జేసీని బదిలీ చేశారు : సోమిరెడ్డి
చెప్పింది చేయలేదని కలెక్టర్‌ని సెలవుపై పంపారు, జేసీని బదిలీ చేశారు : సోమిరెడ్డి
-: నెల్లూరు, ఆగస్టు 12 (సదా మీకోసం) :-
నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు.
విలేఖరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, తాళ్లపాక రమేష్ రెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్, డాక్టర్ జెడ్.శివప్రసాద్, తాళ్లపాక అనూరాధ, వేలూరి రంగారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు మూర్తి, చక్రపాణి, మనుబోలు హెచ్ఎం రమేష్ కుమార్ మృతిపై సంతాపం ప్రకటించడంతో పాటు బాధిత కుటుంబాలకు సోమిరెడ్డి సానుభూతి తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొవిడ్ తీవ్రత ఎక్కువైపోయిందనీ, ఆస్పత్రుల్లో వందల బెడ్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారనీ, కానీ ఒక పాజిటివ్ రోగి ఆస్పత్రిలో అడ్మిట్ కావాలంటే రెండు రోజులు పడుతోందన్నారు.
ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోలేదని మనుబోలు హైస్కూలు హెచ్ఎం రమేష్ కుమార్ నడిరోడ్డుపై విలిపించే పరిస్థితి రావడం దురదృష్టకరమనీ, ఆయన ఆస్పత్రిలోనే మృతి చెందడం బాధాకరమన్నారు.
ఓ వైపు కరోనా వ్యాప్తి చెందుతుంటే అడ్డగోలుగా చెప్పింది చేయలేదని కలెక్టర్ ను సెలవుపై పంపేశారనీ, మంచి అధికారిగా, నిజాయతీ పరుడుగా పేరుతెచ్చుకున్న జేసీ వినోద్ కుమార్ ను బదిలీ చేసేశారనీ, పరిపాలన పరంగా ఇవి తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయని విమర్శించారు.
ఇప్పటి వరకు పరిస్థితులెలా ఉన్నా కొత్త కలెక్టర్ గా వచ్చిన చక్రధర్ బాబుపై నమ్మకం ఉందనీ, ఆసుపత్రల్లోని సౌకర్యాలు, వైద్యసేవల్లోని లోపాలను ఆయన వెంటనే సరిదిద్దుతారని ఆశిస్తున్నామన్నారు.
ఇలాంటి ఆందోళనకరమైన, ప్రాణాంతకమైన, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపే పరిస్థితులు ఇంతకుముందెన్నడూ చూడలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం 8 వేల కోట్లు ఇచ్చానంటోంది..ఆ నిధులు ఏం చేశారనీ, సీఎం రిలీఫ్ ఫండ్ కు వచ్చిన వందల కోట్ల విరాళాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
పారాసెట్మాల్ వేసుకుంటే చాలని ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోవడంతో రాష్ట్రంలో 2.80 లక్షల మంది కరోనా బారినపడ్డారని విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్న రాష్ట్రమైన ఏపీ కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి వచ్చిందన్నారు.
ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో రాజకీయాలను పక్కనపెట్టేద్దామనీ, ప్రజల ప్రాణాలు కాపాడుకోవాల్సిన సమయమిదని అన్నారు.
యువకుడైన సీఎం రాష్ట్రంలో ఎక్కడైనా నాలుగు ఆస్పత్రులు సందర్శించి ప్రజలకు అండగా నిలవకపోవడం దురృదష్టకరమన్నారు.
వైద్యులు, నర్సింగ్, సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారనీ, వారి క్షేమం గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ప్రకటన చేయలేదని విమర్శించారు.
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో రూ.కోటి, విజయవాడ అగ్ని ప్రమాద ఘటనలో రూ50 లక్షలు మృతులకు పరిహారం ప్రకటించడం సంతోషమనీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వసతులు, మెరుగైన వైద్యం లేక ప్రాణాలు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించరా అని సూటిగా ప్రశ్నించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయిన బాధితులకైనా రూ.10 లక్షలు చెల్లించాలని తమ పార్టీ డిమాండ్ చేసిందనీ దానికి ప్రభుత్వ వైపు నుంచి ఉలుకూ..పలుకూ లేదన్నారు.
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేరళ వంటి రాష్ట్రాలను చూసైనా నేర్చుకోవాలన్నారు.
మా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏపీలో కోవిడ్ కంట్రోల్ అయిందని గొప్పలకు పోయిన మంత్రులు ఈ రోజు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
కరోనా మృతుల అంత్యక్రియలకు రూ,15 వేలు ఖర్చు చేస్తున్నామని చెబుతూ మృతదేహాలను చెత్త ట్రాక్టర్లు, జేసీబీల్లో తరలిస్తున్నారన్నారు.
కోవిడ్ రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో ఇస్తామన్న రూ.2 వేలు ఏమవుతున్నాయో అని అనుమానం వ్యక్తం చేశారు.
పాజిటివ్ కేసుల విషయంలో దేశంలోనే మూడో రాష్ట్రంగా నమోదైన తర్వాత కూడా కదలకుండా కూర్చుకుని టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ ని తిట్టుకుంటూ ఉపన్యాసాలిచ్చుకుంటే మీకేమెస్తుందన్నారు.
భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన ఒక ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా వ్యవహరించడం తగదన్నారు.
ఇప్పటికైనా స్పందించి సరిదిద్దుకోకపోతే ఘోరమైన వైఫల్యాలను మూటగట్టుకున్న వారిగా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు.
ఇవి కూడా చదవండి
నిరుపేద మహిళల ఆర్థికాభివృద్ది వై.యస్.ఆర్ చేయూతతోనే : గోతం బాలకృష్ణ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవిద్ – 19 హెల్త్ బులిటెన్ 12-08-2020
కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండండి : లీలా మోహన్ కృష్ణ
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు తగిన సదుపాయాలు కల్పించండి : కలెక్టర్