రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు మంజూరు-ఎమ్మెల్యే కాకాణి

0
Spread the love

రాజకీయాలకు, పార్టీలకు ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు అందజేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, టి.పి.గూడూరు మండల రెవిన్యూ కార్యాలయంలో “నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు” పథకంపై అధికారులతో సమీక్షించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి.పి.గూడూరు మండలంలో పేదలందరికీ ఇళ్లు పధకం కింద 3435 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అర్హత కలిగిన కుటుంబాలు అదనంగా దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వెంటనే అర్హుల జాబితాలో చేర్చండం జరుగుతుందని తెలియజేసారు. ఇళ్ల స్థలాల గుర్తింపు విషయంలో గ్రామాలలో ఎదురయ్యే సమస్యలను అధికారులు సామరస్యంగా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలలో విచారణ చేపట్టి అర్హులను గుర్తించి, అనర్హులను జాబితా నుండి తొలగించాలని అధికారులకు తెలిపారు. సాంకేతిక లోపాలు తలెత్తితే సవరించి, అర్హులకు న్యాయం చేయాలని,గతంలో పేదలకు పంపిణీ చేసిన పట్టాలకు సంబంధించి స్థలాలు ఎక్కడున్నాయో తెలియక లబ్ధిదారులు పట్టాలు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలను గుర్తించి, లేఅవుట్లను అభివృద్ధి చేసి, ఇళ్ల పట్టాలను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తారని, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు అడ్డుకునేందుకు రకరకాల కారణాలతో కోర్టులకు వెళ్లుతున్నారన్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను అడ్డుకోవాలని చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు ప్రయత్నించడం దుర్మార్గం అని మండిపడ్డారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగస్టు 15వ తేది నాడు పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయడానికి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ముఖ్యమంత్రి ఇళ్ల స్థలాలను సేకరించి ప్రజలకు అందించేందుకు వేలాది కోట్లు వెచ్చిస్తుంటే దానిపై విమర్శలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూమితో పాటు అవసరం మేరకు ప్రైవేటు వ్యక్తుల నుండి భూములను కొనుగోలు చేసి, ఇళ్లస్థలాలుగా అందజేస్తున్నామని, పేదలు అనుభవిస్తున్న భూమిని విడిచిపెట్టి, భూస్వాముల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను సేకరించి పేదవారికి ఇళ్లస్థలాలుగా అందిస్తున్నామని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల విషయంలో సమర్థవంతంగా పని చేసిన అధికారులకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!