శ్రీ బాలాజీ జిల్లా నుండి గూడూరు ని తొలగించండి

0
Spread the love

శ్రీ బాలాజీ జిల్లా నుండి గూడూరు ని తొలగించండి

గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేయండి

మమ్మల్ని నెల్లూరు జిల్లా లోనే ఉంచండి

ప్రతిపాదన చేస్తున్న గూడూరు ప్రజలు

గూడూరు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) :

గూడూరు నియోజకవర్గంను శ్రీ బాలాజీ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

గూడూరు ను జిల్లాగా ప్రకటించాలని, లేకపోతే నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని, నాయకులు కార్యకర్తలతో కలసి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి కృష్ణ మందిరం, రాజావీధి, టవర్ క్లాక్ సెంటర్ మీదుగా నిరసన ర్యాలి చేస్తూ, ఆర్డీవో కార్యాలయం నందు మోకాళ్ళ పై నిరసన వ్యక్తం చేసిన మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ ఏవో కి వినతి పత్రం అందించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం అనే పేరుతో జనవరి 26 వ తేదీన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ రాజ పత్రం(గెజిట్ నోటిఫికేషన్) విడుదల చేశారని తెలిపారు.

తిరుపతి జిల్లా కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లాను ఏర్పాటు చేసి దానిలో తిరుపతి, చంద్రగిరి, శ్రీ కాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు శాసన సభ నియోజకవర్గాలను కలిపారన్నారు.

గూడూరు ప్రస్తుతం నెల్లూరు జిల్లా కేంద్రంగా నెల్లూరు జిల్లాలో ఉందని, గూడూరు-నెల్లూరు 36 కి.మీ దూరంతో 45 నిమిషాల ప్రయాణంతో మాకు ఎంతో సౌకర్యంగా ఉందన్నారు.

అటువంటి మిమ్మల్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలిపితే జిల్లా కేంద్రమైన తిరుపతి 100 కి.మీ పై చిలుకూ దూరం ఉంటుందని తెలిపారు.

అది గూడూరు నియోజకవర్గ ప్రజలకు సౌకర్యవంతం కాదని, పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంచినపుడు, ప్రజలకు అది సౌకర్యవంతంగా ఉండాలని హితవు పలికారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గూడూరు నియోజకవర్గ ప్రజలు అన్ని విధాలుగా కూడా నష్టపోతున్నారని తెలిపారు.

నియోజకవర్గంలో ఉన్న వైసిపి నాయకులు కూడా ఆలోచించాలని, ఎంతో చరిత్ర కలిగిన మన గూడూరును, బాలాజీ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ, ముఖ్యమంత్రి కి గూడూరును జిల్లాగా చేయాలని, లేకపోతే నెల్లూరు జిల్లాలోనే ఉంచేలా శాసన సభ్యులు ద్వారా విన్నవించాలని కోరారు.

శ్రీ బాలాజీ జిల్లాలో గూడూరు ను తొలగించాలని, లేకపోతే గూడూరు జిల్లా కేంద్రంగా సూళ్ళూరుపేట, వెంకటగిరి ,సర్వేపల్లి నియోజకవర్గాలలోని 22 మండలాలు ఒక గ్రేడ్ -1 మునిసిపాలిటి మరియు 3 మునిసిపాలిటిలను కలిపి ఒక జిల్లా గా ప్రకటించాలని కోరారు.

అట్లు వీలుగాని పరిస్థితులలో మమ్ములను సౌకర్యవంతంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గ,పట్టణ,మండల,వార్డు, గ్రామ, అనుబంధ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!