ఆక్రమణలపై, దోపిడీలపై చర్యలు తీసుకోండి….. ఛైర్ పర్సన్ ఆనం ఆరుణమ్మని కోరిన 1వ డివిజన్ ప్రజలు
ఆక్రమణలపై, దోపిడీలపై చర్యలు తీసుకోండి
ఛైర్ పర్సన్ ఆనం ఆరుణమ్మని కోరిన 1వ డివిజన్ ప్రజలు
నెల్లూరు జడ్పీ, జూలై 17 (సదా మీకోసం) :
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మకి నెల్లూరు రూరల్ మండలం ఒకటో డివిజన్ కోడూరుపాడు గ్రామ ప్రజలు గ్రామంలో జరుగుతున్న కొన్ని ఆక్రమణలపై, దోపిడీలపై చర్యలు తీసుకొన వలసినదిగా వినతి పత్రం అందజేశారు.
కోడూరుపాడు గ్రామం నందు గల పెన్నా పరివాహక ప్రాంతంలోని ప్రభుత్వ ‘పోడు భూమి’ లో కొంతమంది స్థానిక నాయకులు ప్లాట్లు వేసి సొంత ఏజెంట్లను నియమించుకొని, పొరుగు ప్రాంతాలవారికి ఒక్కొక్క ప్లాటు రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు అమ్ముకుంటున్నారని, ఈ ఆక్రమణలను ఆపవలసినదిగా కోరారు.
అదేవిధంగా గ్రామంలోని పెన్నా నదిలో ఇసుకను కొంతమంది పెద్ద నాయకులు, స్థానిక నాయకుల సహాయంతో సుమారు 33 ట్రాక్టర్లు ప్రతిరోజు ఇసుక తరలిస్తున్నారని, ఈ విషయంపై ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని, పెన్నా పొల్లు కట్ట కూడా తవ్వేస్తున్నారని, దానివలన వరదలు వచ్చినప్పుడు పొర్లు కట్ట తెగి నీటి ప్రవాహం ఎక్కువై, గ్రామంలో నీటి ఎల్లవ ఎక్కువవుతుందని, కావున ఈ ఇసుక మాఫియా దొంగలను అరికట్టవలసినదిగా కోరారు.
ఈ విషయంపై స్పందిస్తూ ఆనం అరుణమ్మ కోడూరుపాడు గ్రామ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ కేవీయన్ చక్రధర్ బాబు దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని తెలిపారు.
కలెక్టర్ సానుకూలంగా స్పందించి, ఈ ఆక్రమణలపై చర్య తీసుకొనవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆనం ఆరుణమ్మ వివరించారు.