ముందస్తు నగదు చెల్లింపులు చేసి ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు
![](https://sadhameekosam.com/wp-content/uploads/2022/03/Banner-31.jpg)
ముందస్తు నగదు చెల్లింపులు చేసి ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు
నెల్లూరు కలెక్టరేట్, మార్చి 21 (సదా మీకోసం) :
జిల్లాలోని అన్ని జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులకు ముందస్తు నగదు చెల్లింపులు చేసి ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఆర్.డి.ఓ లు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎం.పి.డి.ఓ లు, తహశీల్దార్ల తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో ఇంకా ఇల్లు మొదలు పెట్టని లబ్ధిదారులకు ముందస్తుగా 10 నుంచి 15 వేల రూపాయల నగదు జమచేసి, వారు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఉగాది నాటికి ఇంకా మొదలు కాని ప్రతి ఇల్లు బేస్మెంట్ స్థాయి దాటేలా పనులు చేపట్టాలన్నారు. ఓటిఎస్ మెగా డ్రైవ్ ను నిర్వహించి నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేయాలని, నగదు చెల్లించిన లబ్ధిదారులకు డాక్యుమెంటేషన్ పూర్తిచేసి రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఆదేశించారు.
స్పందన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనాన్ని తప్పనిసరిగా పరిశీలించి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఉగాది పురస్కారాలు అందజేస్తామని పేర్కొన్నారు.
జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ మార్చి 31లోగా జిల్లాలోని 43 గ్రామాల్లో భూముల రీ సర్వేను పూర్తి చేసేందుకు త్వరితగతిన అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఓ టి ఎస్ కు సంబంధించి తాసిల్దార్ల అప్రూవల్స్ పెండింగ్లో లేకుండా చూడాలని, స్కానింగ్, డిజిటల్ సంతకాల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను లబ్ధిదారులకు త్వరగా అందించాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, కే ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దాసు, డిఆర్డిఎ పిడి సాంబశివారెడ్డి, సివిల్ సప్లయిస్ డిఎం పద్మ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎడి హనుమాన్ ప్రసాద్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అల్తాఫ్, మెప్మా పిడి రవీంద్ర, హ్యాండ్లూమ్స్ ఏడి ఆనంద్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.