నాడు చ‌క్కెర ఫ్యాక్ట‌రీని పున‌రుద్ధ‌రిస్తామ‌ని….. నేడు అమ్మ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు

0
Spread the love

నాడు చ‌క్కెర ఫ్యాక్ట‌రీని పున‌రుద్ధ‌రిస్తామ‌ని

నేడు అమ్మ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు

  • మాట తప్పని,మడమ తిప్పని ముఖ్యమంత్రి…. కోవూరు సహకార చక్కెర ఫ్యాక్టరీని పునరుద్దరిస్తానని పాదయాత్ర సాక్షిగా బుచ్చి లో చెప్పి నేడు మాట ఎందుకు తప్పారు ?
  • సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తొలి బడ్జెట్ లో ప్రకటించి దానిని అమలు చేయకుండా ఎందుకు మడమ తిప్పారు ?
  • కోవూరు తో సహా 6 సహకార చక్కెర ఫ్యాక్టరీలను లిక్విడేషన్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ. నెం.15 ను వెంటనే రద్దు చేసి, తొలి బడ్జెట్ లో ఇచ్చిన హామీ మేరకు రూ.100 కోట్ల తో ఆ ఫ్యాక్టరీలను వెంటనే పునరుద్ధరించాలి.
  • ప్రసన్నకుమార్ రెడ్డి గారు…. మీ ముఖ్యమంత్రి కోవూరు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని నాడు హామీ ఇచ్చి నేడు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తుంటే మీరు ఎందుకు స్పందించడం లేదు.
  • నాడు తండ్రి కోవూరులో ఎన్‌టిఎస్ ను శాశ్వతంగా మూసి వేస్తే, నేడు కుమారుడు కోవూరు సుగర్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేస్తున్నారు.
  • టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

కోవూరు, మార్చి 21 (స‌దా మీకోసం) :

కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో కోవూరు మాజీ జడ్పీటీసీ సభ్యులు,టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, 2500 టన్నుల రోజువారీ క్రషింగ్ సామర్ధ్యం కలిగిన కోవూరు సహకార చక్కెర కర్మాగారం అనేక కారణాలతో 2013 వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉన్న సమయంలోనే మూతపడిందన్నారు.

ఈ ఫ్యాక్టరీ మూతపడే సమయానికి రైతులకు రూ.5 కోట్ల రూపాయల బకాయిలు ఉండగా, 2014 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు ఇవ్వాల్సిన రూ.5 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం జరిగిందని తెలిపారు.

2018, ఫిబ్రవరి 5 వ తేదీన ప్రతిపక్ష నాయకుడు హోదాలో వైయస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ, కోవూరు నియోజకవర్గము, బుచ్చిరెడ్డి పాళెం కు వచ్చిన సందర్భంగా మేము అధికారం లోకి వచ్చిన వెంటనే కోవూరు సహకార చక్కెర కర్మాగారం కార్మికుల జీతాల బకాయిలను చెల్లించటంతో పాటు ఫ్యాక్టరీని పునరుద్దరిస్తానని మాట ఇచ్చారని గుర్తు చేశారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ లో రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం తీసుకోవలసిన చర్యల కోసం నిపుణుల కమిటీ నియమించిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అన్ని ఫ్యాక్టరీలను సందర్శించి, ఆ ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం అనేక సూచనలు చేస్తూ, ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది. సంబంధిత నివేదిక లో కోవూరు ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని నిపుణుల కమిటీ సూచించిందని, ఈ నివేదిక ఆధారంగా కోవూరు ఫ్యాక్టరీని త్వరలోనే ముఖ్యమంత్రి పునరుద్దరిస్తారని ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారని తెలిపారు.

అయితే ఈ నివేదిక ఇచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వం సహకార చక్కెర కర్మాగారాలను పునరుద్ధరణ చేసింది లేదు. అదేవిధంగా కార్మికులకు ఇవ్వవలసిన జీతాల బకాయిలను చెల్లించకుండా ఉన్న పళంగా కోవూరు ఫ్యాక్టరీతో సహా 6 ఫ్యాక్టరీలను లిక్విడేషన్ అంటే శాశ్వతంగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ జి.ఓ. నెం.15 ను జారీ చేసిందని, ఈ జీ.ఓ. తో కోవూరు సహకార చక్కెర కర్మాగారం శాశ్వతంగా మూత పడనున్నదని తెలిపారు.

కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడితే “మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పరు, మడమ తిప్పరు” అని చెపుతుంటారు. మరి కోవూరు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్దరిస్తానని నాడు మాట చెప్పి ఎందుకు నేడు మాట తప్పారో, ఎందుకు మడమ తిప్పారో చెప్పాలని ప్ర‌శ్నించారు.

గతంలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కోవూరులో ఉన్న నెల్లూరు థర్మల్ స్టేషన్ ను శాశ్వతంగా మూసి వేస్తే…. నేడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కోవూరు సహకార చక్కెర ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసి వేస్తున్నార‌న్నారు. కోవూరు తో సహా రాష్ట్రంలోని 6 సహకార చక్కెర ఫ్యాక్టరీలను శాశ్వతంగా మూసివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం 15 ను వెంటనే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేశారు.

కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిత్యం చంద్రబాబు నాయుడుని తిట్టడము మాని, కోవూరు సహకార చక్కెర ఫ్యాక్టరీని కాపాడటానికి ప్రయత్నాలు చేస్తే బావుంటుందని స‌ల‌హా ఇచ్చారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దారా విజయబాబు, కలికి సత్యనారాయణ రెడ్డి,జక్కంరెడ్డి భాస్కరరెడ్డి,ఇంటూరు విజయ్,మారుబోయిన వెంకటేశ్వర్లు,మహమ్మద్,ఖలీల్,వల్లెపు సురేష్,వేమయ్య, ఉమాయల్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!