వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన చేశాడు : ఎమ్మెల్యే కాకాణి
చంద్రబాబు వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు దుర్మార్గపు ఆలోచన చేశాడు : ఎమ్మెల్యే కాకాణి
-: నెల్లూరు, ఆగస్టు 2 (సదా మీకోసం) :-
నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా వికేంద్రీకరణకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు.
మూడు రాజదానుల ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం చేయడం జరిగిందన్నారు.
ప్రజల చేతిలో ఓడిపోయిన చంద్రబాబు తన బలంతో శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు దుర్మార్గపు ఆలోచన చేశాడని విమర్శించారు.
రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపడంతో గవర్నర్ కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని మూడు రాజధానుల బిల్లుకు ఆమోద ముద్ర వేశారన్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో గవర్నర్ నిర్ణయం బాగా తీసుకున్నారు అన్న చంద్రబాబు… మూడు రాజధానుల విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని ఎందుకు తప్పు పడుతున్నాడని ప్రశ్నించారు.
చంద్రబాబుకు ఉన్న రెండు నాలుకుల ధోరణి మరోసారి రుజువైందన్నారు.
చంద్రబాబు అమరావతి కోసం అంటూ 35 వేల ఎకరాలు తీసుకుని భూ దందా తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.
అఖిలపక్షం అంటే అర్థం తెలుగుదేశం వాళ్లకు తెలుసా…! అని ప్రశ్నించారు.
గతంలో అమరావతి ఏర్పాటు సమయంలో చంద్రబాబు ఎందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయలేదన్నారు.
ఓటుకు కోట్ల కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ అదిగో విశ్వనగరం అంటూ గ్రాఫిక్స్ తప్ప 5సంవత్సరాలు ఏమి చేయలేదన్నారు.
అమరావతి ఒక్కటే అభివృద్ధి చెందాలా, ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి జరగ కూడదా అనేది చంద్రబాబు స్పష్టం చేయాలన్నారు.
వికేంద్రీకరణ అనేది సచివాలయ వ్యవస్థతో గ్రామాల్లో ప్రారంభించి, రాష్ట్ర స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారన్నారు.
రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు కు, తెలుగుదేశం నాయకులకు లేదన్నారు.
నాపై ఓడిపోయిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడమనేది రాజ్యాంగ విలువలా..! అని ప్రశ్నించారు.
ప్రజలు గెలిపించిన నన్ను కాదని ఓడిపోయి దొడ్డిదారీలో మంత్రిగా ఉన్న వ్యక్తికి అధికారాలు ఇవ్వడమా రాజ్యాంగమా! అని ప్రశ్నించారు.
గతంలో విలువలను తుంగలో తొక్కి నారావారి రాజ్యాంగం అమలు చేసి, ఇప్పుడు లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తున్నాడన్నారు.
రాజ్యాంగ విలువల ప్రకారం గవర్నర్ మూడు రాజధానులకు ఆమోద ముద్ర వేశారన్నారు.
చంద్రబాబు ఏది పడితే అది మాట్లాడటానికి ఆయనకున్నది నాలుకా తాటి మట్టా తెలియడం లేదన్నారు.
గతంలో అమరావతి ని రాజధానిగా ప్రకటించిన్నపుడు మీరు రెఫరెండం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీలో గెలుపొందిన 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబును భరించలేక వైదొలుగుతున్నారన్నారు.
చంద్రబాబును ప్రజలు తరిమి కొట్టినా సిగ్గు, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడన్నారు.
ప్రజలు కోరుకుంటున్న విధంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ విషయంలో కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్లడానికి ఆంధ్రులు ఆయన వెంట నడవడం ఖాయమన్నారు.