వైఎస్.వివేకానందరెడ్డి ‍హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ వ్యాఖ్య‌లు : బీద ర‌విచంద్ర‌

0
Spread the love

వైఎస్.వివేకానందరెడ్డి ‍హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ వ్యాఖ్య‌లు : బీద ర‌విచంద్ర‌

  • వైఎస్.వివేకానందరెడ్డి ‍హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత నిందలు మోపడం సిగ్గుచేటు..
  • చంద్రబాబు నాయుడుని మళ్ళీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పంపడమే టిడిపి కార్యకర్తల లక్ష్యం..

నెల్లూరు రూర‌ల్‌, న‌వంబ‌ర్ 19 (స‌దా మీకోసం) :

నెల్లూరు నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, తాళ్ళపాక అనురాధ,అన్నం దయాకర్ గౌడ్ తదితరులు లతో కలిసి మీడియా సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో బీద మాట్లాడుతూ, “వైసీపీ పాలనలో పెట్రోల్, డీజీల్ ధరలు పెంచటమేకాకుండా చెత్త పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్నులు వేసి ప్రజలపై మోయలేని భారం మోపారు.

చేతికందినకాడికి అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్దిక సంక్షోభం లోకి నెట్టారు. రాష్ట్రంలో ఉద్యోగులకు కనీసం జీతాలిచ్చే పరిస్థితి లేదు.

వైఎస్ వివేకానందరెడ్డిని సొంత కుటుంబ సభ్యులే చంపారని ప్రజల్లో చర్చ జరుగుతోంది… వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారిపై వైసీపీ నాయకులు నీచంగా మాట్లాడటం సిగ్గుమాలిన చర్య.

ఒకరిపై అపనిందలు వేస్తూ, నీచంగా మాట్లాడుతున్న వైసీపీ నేతలు మనుషులా ! లేక రాక్షసులా? తన చెల్లి, తల్లి, చిన్నాన్నపై టీడీపీ నేతలు మాట్లాడారని జగన్ అంటున్నారు, కానీ వైసీపీ నేతలు మాదిరి టీడీపీ నేతలు ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడలేదు.

వైయస్ హయాంలో జరిగిన పాలనా వైఫల్యాలు, అవినీతి గురించి టీడీపీ నేతలు మాట్లాడారే తప్ప ఏనాడు కుటుంబ సభ్యుల గురించి అసభ్యంగా మాట్లాడలేదు?

నాడు షర్మిల ను ” నీతండ్రి ఓ తాగుబోతు” అన్న బొత్సకి, జగన్ అవినీతి పరుడన్న కన్నబాబుకి ‎, “విజయమ్మా.. జగన్ లాంటి వ్యక్తిని ఎలా కన్నావ్” అన్న వారిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టిన ఘనత వైఎస్ జగన్ ది.

వైఎస్ జగన్ మొదలుకుని విజయసాయిరెడ్డి తో సహా వైసీపీ నేతలంతా చంద్రబాబు నాయుడుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.‎

నాడు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందన్నారు, వివేకాను చంద్రబాబే చంపారని దుష్ప్రచారం చేశారు, కానీ వివేకాను ఎవరు చంపారో ఆయన డ్రైవర్ దస్తగరి స్పష్టంగా చెప్పారు.

వివేకానంద రెడ్డి హత్య గురించి, వైసీపీ నేతల హత్యా రాజకీయాల పై కడపలో ప్రజలు కోడై కూస్తున్నారు. వీటిని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి వైసీపీ నేతలు అస‎భ్యంగా మాట్లాడటం దుర్మార్గం.

చంద్రబాబు గారు కన్నీరు పెట్టడం నేను ఏనాడు చూడలేదు. చంద్రబాబు గారిని ఏడిపించిన వైసీపీ నేతలు అంతకు అంత అనుభవించక తప్పదు.

నారా భువనేశ్వరి గారు ఏనాడు రాజకీయాల్లో ‎ జోక్యం చేసుకున్నది లేదు. విలువలు కల్గిన మహాతల్లి ఆమె…అలాంటి ఆమె పై వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడుతుంటే జగన్ ఖండించకపోవటం సిగ్గుచేటు.

నాడు అసెంబ్లీలో జరిగిన అవమానానికి ఎన్టీఆర్ గారు అసెంబ్లీని బహిష్కరించి , మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.. నేడు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మళ్లీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి ని చేసి అసెంబ్లీకి పంపేవరకు టీడీపీ కార్యకర్తలు , నాయకులంతా కష్టపడి పనిచేస్తాం. ‎అధికారంలోకి వచ్చి వైసీపీకి తగిన బుద్ది చెబుతాం.” అన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!