అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
-: నెల్లూరు, జూన్ 26 (సదా మీకోసం) :-
గత నాలుగు రోజులుగా నెల్లూరు సారాయి అంగడి నుంచి, నేతాజీ నగర్, ప్రగతి నగర్ గౌతమి నగర్, తదితర ప్రాంతాలకు చుక్కనీరు రావడం లేదని, అయ్యా మహాప్రభు గుక్కెడు నీళ్లు కూడా లేవు, కనీసం మరుగుదొడ్లకు వెళ్లాలన్నా నానా అవస్థలు పడుతున్నామని అనేకమందిమి ఫిర్యాదులు చేశామన్నారు.
అయినా కార్పొరేషన్ అధికారులకు ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా లేదని, ఇక లాభం లేదనుకొని స్థానికులమైన మేమే రోడ్డు మీదికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
పొదలకూరు రోడ్డు ప్రగతి నగర్, గౌతమి నగర్ నేతాజీ నగర్ వద్ద జరుగుతున్న పనులను స్థానికులు అడ్డుకుని, ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్ తాగునీటి పైపులను ఎలా ధ్వంసం చేస్తారని ప్రశ్నించారు.
నెల్లూరు కార్పొరేషన్ లో ఎంత మంది అధికారులు ఉన్న నాలుగు రోజులుగా తాగునీరు లేక మూడు ప్రాంతాలకు చెందిన ప్రజలు అల్లాడుతుంటే ఏ ఒక్క అధికారి తమ వద్దకు రాలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఓ దశలో స్థానికులు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొంతమంది అండ చూసుకొని కాంట్రాక్టర్ యధేచ్చగా రెచ్చిపోతున్నాడని వారు ఆరోపించారు.
తాగునీటి పైపులైన్లు ధ్వంసం చేసి, కనీసం నాలుగు రోజుల అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండా ఉండటం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. ఈక్రమంలో పెద్దఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది.
కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్, టిడిపి నేత జలదంకి సుధాకర్, టిడిపి ఎస్సీ సెల్ మాతంగి కృష్ణ స్థానికులు తదితరులు ప్రజలకు ఏర్పడిన సాగునీటి కష్టాలపై అక్కడ పనులు చేస్తున్న వారిని ప్రశ్నించారు.