ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాల వాడకం పెరగాలి : మున్సిపల్ హెల్త్ ఆఫీసర్
ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాల వాడకం పెరగాలి
మున్సిపల్ హెల్త్ ఆఫీసర్
-: నెల్లూరు కార్పొరేషన్, జూలై 03 (సదా మీకోసం) :-
ప్లాస్టిక్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాల వాడకం పెరిగినపుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రపంచ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక విఆర్సీ కూడలి నుంచి ఆర్టీసి వరకు అవగాహనా ర్యాలీని ఆదివారం ఉదయం నిర్వహించారు.
ర్యాలీలో భాగంగా కూరగాయల మార్కెట్టులో పర్యటించి వినియోగదారులు, దుకాణాదారులకు నార, జౌళి సంచుల వాడకంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ 75 మైక్రోన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వినియోగంపై నగరంలో ఇప్పటికే నిషేధం ఉందని, అలాంటి ఉత్పత్తుల వినియోగంపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈనెల 1వ తేదీ నుంచి ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, ఎగుమతి, గోదాముల్లో నిల్వ, రవాణా, అమ్మకం, కొనుగోలు, వాడకం వంటి చర్యలను పూర్తిగా నిషేదించామని ప్రకటించారు.
ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తులైన ఇయర్ బడ్స్, ఐస్ క్రీమ్ స్పూన్స్, ప్లాస్టిక్ జెండాలు, చాకలేట్ స్టిక్స్, క్యారి బాగ్స్ తదితర ఉత్పత్తుల వాడకంపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామని స్పష్టం చేసారు.
అందులో భాగంగా నగర వ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీదారులు, రిటైలర్లు, అమ్మకందారులుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధాజ్ఞలను పటిష్టంగా అమలు చేయనున్నామని వెల్లడించారు.
ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై ప్రజలంతా అవగాహన పెంచుకుని బాధ్యతగా వ్యవహరించాలని ఆరోగ్య శాఖాధికారి సూచించారు.
కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు సంజయ్, శేషగిరిరావు, సచివాలయం కార్యదర్శులు, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.