అనాధలయ్యాం- ఆస్థులు పంపిణీ చేసిఆదుకోండి…
*న్యాయం కోసం మహిళ ఒంటరిపోరాటం…*
*కుటుంబ ఆస్తులు పంపకం కొరకు అధికారులు సహకరించాలి*
*న్యాయం జరిగే వరకు పోరాటం*
*మీడియా ముందు గోడు వెలగక్కిన మహిళ*
అనాధలయ్యాం ఆస్థులు పంపిణీ చేసి ఆదుకోవాలని చిల్లకూరు మండలం ఓడూరు గ్రామానికి చెందిన మహిళ ఎద్దు పెంచలమ్మ రెవెన్యూ అధికారులు, పోలీసులను ఆభ్యర్థిస్తోంది. శుక్రవారం తన సమస్యలను పట్టణంలోని కటకరాజావీధిలో ఉన్న ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఏకరువు పెట్టారు. ఓడూరుకు చెందిన తన తల్లిదండ్రులు ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందారన్నారు. ఎనిమిదేళ్ల క్రితం భర్త విడాకులివ్వడంతో చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుమారుడిని చదివించుకుంటున్నానన్నారు. మూడు నెలల క్రితం తల్లి మృతితో ఉద్యోగం వీడాల్సి వచ్చిందన్నారు. తన తల్లి దండ్రులకు చెందిన ఏడెకరాల పొలంలో వాటా ఇవ్వాలని కోరగా తన ఇద్దరు చెల్లెళ్లు ఇంటి నుండి తరిమేశారన్నారు. వారసురాలిగా, పెద్ద కుమార్తెగా తనకు దక్కాల్సిన ఆస్థి వాటాను దక్కనీకుండా అదే గ్రామానికి చెందిన నాగిశెట్టి శారదమ్మ రాజకీయ పలుకుబడితో కావాలని అడ్డుకుంటోందన్నారు. అదేవిధంగా తన మేనత్తకు చెందిన రెండెకరాల పొలంలో అప్పులు చేసి నిమ్మ మొక్కలు నాటితే మూడో రోజు వాటిని పీకివేశారన్నారు. నిమ్మ మొక్కలు నాటుతున్న విషయాన్ని గ్రామంలో అందరికీ చెప్పానన్నారు. అయితే తన చెళ్లెళ్లు శారదమ్మ ప్రోద్బలంతో నిమ్మ మొక్కలు సైతం పీకివేయించి 50 వేల రూపాయల నష్టం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎవరి ఆస్థి వద్దని కేవలం తవ తల్లిదండ్రుల నుండి సంక్రమించే ఆస్థిని నలుగురు చెల్లెళ్లకు సమానంగా వచ్చే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనాధగా మారిన తనకు కుమారుడిని చదివించుకునేందుకు వేరే ఏ ఇతర ఆస్కారం లేదన్నారు. అధికారులు, గ్రామ పెద్దలు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బాధితురాలి బంధువులు, కుమారుడు తదితరులు పాల్గొన్నారు.