మనల్ని కరిచిన కుక్కని ఏంచేయాలి?
మనల్ని కరిచిన కుక్కని ఏంచేయాలి ?
చెప్పు తెగిందాకా కొట్టాలి !
కుక్క చచ్చిందాకా కొట్టాలి !!
ఇవి కుక్క కరిచిందన్న బాధలోనుంచి వచ్చే స్పందనలు.నిజానికి మనల్ని కరిచిన కుక్కను చంపడం కాదు కదా కొట్టడం కూడా చెయ్యొద్దు. మనల్ని కరిచిన కుక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.ఎంత జాగ్రత్తగా అంటే అత్త గారింటికి వచ్చిన కొత్త అల్లుడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా ఈ కుక్కను చూసుకోవాలి. ఆ కుక్క బ్రతుకు మీద మనకు జరగబోయే వైద్యం ఆధారపడి ఉంది.ఆ కుక్క ను బ్రతికించు కోవడం మనకు చాలా అవసరం. ఎందుకంటే మనల్ని కరిచిన కుక్క మనల్ని కరిచిన రోజు నుంచి పదో రోజు వరకు బ్రతికి ఉంది అంటే దాని వల్ల మనకు కుక్క కాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం లేనేలేదు.
రేబీస్ వ్యాధి వున్న ఏ జీవి వారానికి మించి బ్రతకదు. మనల్ని కరచిన కుక్క పదిరోజులపాటు బతికి వుందంటే ఆ కుక్కకు రేబీస్ జబ్బు లేదని. దానికే రేబీస్ జబ్బులేనప్పుడు ఆ కుక్క కాటు వలన మనకు రేబీస్ వచ్చే అవకాశం వుండదు కదా! అందుకే మనల్ని కరిచిన కుక్కను కొట్టొద్దు, చంపొద్దు. ఇతరులను కరవకుండా చూసుకోవాలి, పదిరోజులు బ్రతికిించుకోవాలి. పదోరోజు వరకు బ్రతికుందో లేదో గమనించు కోవాలి. సాధ్యమైతే ఆ కుక్కను గృహనిర్బంధంలో పెట్టి కావలసిన ఆహారం అంతా సమకూర్చే పది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. పదోరోజు వరకు బ్రతికుంటే పదకొండవ రోజు పండగ జేస్కో. ఎందుకంటే రేబీస్ జబ్బు వచ్చి 10 వ రోజు వరకు బ్రతికిన జంతువు యింతవరకు లేదు. పదవ రోజు వరకు బతికి ఉందంటే దానికి రేబీస్ లేనేలేదు. కాబట్టి దాని కాటువల్ల మనకు రేబిస్ వచ్చే అవకాశం కూడా లేనేలేదు.
డా. యం.వి.రమణయ్య
సీనియర్ వైద్యులు, రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల, నెల్లూరు.
రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక, ఆంధ్ర ప్రదేశ్.