23 న చలో నెల్లూరు…. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

0
Spread the love

23 న చలో నెల్లూరు…. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

  • రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలిని కోరుతూ 23 న చలో నెల్లూరు
  • నెల్లూరు నర్తకి సెంటర్ నుండి కలెక్టర్ వరకు ర్యాలీ
  • రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు ఎక్కడ?
  • రైతుల నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వం
  • మాజీమంత్రి సోమిరెడ్డి ధ్వజం

-: గూడూరు, మార్చి 20 (స‌దా మీకోసం) :-

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 23 న చలో నెల్లూరు కార్యక్రమం చేపడుతున్నట్లు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.

ఆదివారం గూడూరు పట్టణంలోని గమళ్ల పాళెం లో ఉన్న నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టిడిపి నాయకులు, కార్యకర్త లతో సోమిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ లు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని, ప్రతి సచివాలయంలో పట్టికను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

అయితే ఆ పట్టిక కేవలం సచివాలయానికి మాత్రమే పరిమితమైందే గానీ ఒక్క రైతు వద్ద కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదన్నారు.

ప్రభుత్వం గానీ వ్యవసాయ అధికారులు గానీ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ధాన్యాన్ని రైతుల వద్ద కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

పసుపు రైతులు అప్పులు చేసి పంటను పండించి అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని వెంటనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పసుపు యార్డు ఏర్పాటు చేసి పసుపు కొనుగోలు చేయాలన్నారు.

మెట్ట ప్రాంతాలలో మొక్క జొన్న, సజ్జ వంటి పంటలు వేస్తున్న తరుణంలో రైతుల వద్ద ఒక్క క్వింటా కూడా గతంలో కొనుగోలు చేయకుండా 30 శాతం మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు కుంటిసాకులు చెబుతూ రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు.

మరొక వైపు కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నివారణకు ప్రభుత్వం కేవలం కొన్ని మాత్రలు అందించి చేతులు దులుపుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కరోనా మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే కారణమన్నారు.

ఓ వైపు రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆందోళనలు పట్టించుకోకుండా నిత్యావసర సరుకుల ధరలు, ముడిచమురు ధరలు పెంచేసి పేదవాడిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

మాజీ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని లేకుంటే రైతుల తరపున తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

23 న నెల్లూరు లో జరిగే మహాధర్నా లో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు స్వచ్ఛంధంగా తరలిరావాలి అనీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ రైతు విభాగ అధ్యక్షుడు రాధ కృష్ణా టిడిపి నేతలు నెల్లబల్లి భాస్కర్ రెడ్డి,పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లరాజు, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, ఇశ్రాయేలు కుమార్, పల్లె కోటేశ్వరరావు, మట్టం శ్రావణి, గుండాల భారతి, ఉచ్చురు వెంకటేశ్వర్లు రెడ్డి, గణపర్తి కిషోర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!