జ్వరం ఉన్న అందరికీ కరోనా టెస్టులు చేయండి: ఈటల

వైద్య సిబ్బంది ప్రజల ప్రాణాలు కాపాడటానికి చాలా శ్రమిస్తున్నారని ఊపిరితిత్తులు, శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉన్నవారికి కరోనా ఎక్కువ ప్రమాదకరంగా మారిందని ఈటల అన్నారు.
కరోనా వ్యాప్తి కట్టడి చర్యలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్యాధికారులతో సమావేశం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. జ్వరం వచ్చిన ప్రతిఒక్కరిని వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయాలని సూచించారు. దీని ద్వారా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినా ప్రాణనష్టం జరగకుండా ఉంటుందని ఈటల పేర్కొన్నారు. ఇప్పటికే అనేక వైరస్‌లను ఎదుర్కొన్నామని, కరోనా వైరస్ భయాన్ని అధిగమించామని ఈటల చెప్పారు. గతంలో మశూచి, సార్స్ వంటి అనేక రకాల వైరస్‌లు ప్రబలాయని గుర్తు చేశారు.
వైద్య సిబ్బంది ప్రజల ప్రాణాలు కాపాడటానికి చాలా శ్రమిస్తున్నారని ఊపిరితిత్తులు, శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉన్నవారికి కరోనా ఎక్కువ ప్రమాదకరంగా మారిందని అన్నారు. అయితే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన విధంగా విధిగా భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పాటిస్తే కరోనా దరిచేరకుండా ఉంటుందని అన్నారు. రాష్ర్టంలో రాపిడ్ టెస్టులు అందుబాటులోకి వచ్చాక టెస్టింగ్ కెపాసిటీ పెరిగిందని మంత్రి ఈటల పేర్కొన్నారు.
ప్రస్తుతం రాపిడ్ టెస్టులు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ పరీక్షలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరగా వైరస్‌ను గుర్తిస్తే ప్రాణ నష్టం జరగకుండా చూడొచ్చన్నారు. జ్వరం వచ్చిన వారందరినీ ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయించాలని ఈటల రాజేందర్ నిర్దేశించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.