పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు
ప్రకటించిన వాటికన్ వర్గాలు

కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు.
ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారు.
ఫిబ్రవరి 14 నుంచి ఆయన 38 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం గత నెల డిశ్చార్జి అయ్యారు.
ఆయన మృతి విషయాన్ని వాటికన్ వర్గాలు ధ్రువీకరించాయి. 2013లో 16వ పోప్ బెనిడెక్ట్ తర్వాత ఫ్రాన్సిస్ ఈ బాధ్యతలు చేపట్టారు.
ఫ్రాన్సిస్ 1938లో అర్జెంటీనాలో జన్మించారు.
దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకొన్న తొలి వ్యక్తి ఆయనే. ఆయన్ను ప్రజల పోప్ అంటారు.
తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు.
2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు.
దీనిని ఆయన వినయం, సేవాతత్పరతకు చిహ్నంగా భావిస్తారు.
మరణానికి కొన్ని గంటల ముందు కూడా..
పోప్ ఫ్రాన్సిస్ తన మరణానికి కొన్ని గంటల ముందు కూడా ఈస్టర్ పర్వదినాన భక్తులకు సందేశం ఇచ్చారు.
వాటికన్ నగరంలోని పీటర్స్ స్క్వేర్‌లో దాదాపు 35,000 మందిని ఉద్దేశించి ఆయన ప్రపంచం కోసం సందేశం ఇచ్చారు.
‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాపీ ఈస్టర్..!’ అని పోప్ స్వయంగా చెప్పారు.
అనంతరం ఆయన సందేశాన్ని ఆర్చి బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు.
సంక్షోభాలతో రగులుతున్న గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్‌లలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషతో కలిసి ఈస్టర్ సందర్భంగా పోప్‌ను కలిశారు.
ఈ సందర్భంగా పోప్ మూడు పెద్ద చాకొలెట్ ఈస్టర్ ఎగ్స్‌ను వాన్స్ దంపతులకు బహూకరించారు.
ఆయన అనారోగ్యం పాలైన తర్వాత అంతమంది జనాల్లోకి రావడం ఇదే తొలిసారి.
ప్రత్యేక వాహనంలో ప్రజల మధ్య నుంచి ఆయన ప్రయాణించడం విశేషం.
మధ్యలో ఆగి పసికందులను, చిన్నారులను ఆశీర్వదించారు.


