వేసవిలో మంచినీటి సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోండి : కమీషనర్ హరిత

వేసవిలో మంచినీటి సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోండి
సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పరిశీలనలో కమిషనర్
నెల్లూరు కార్పొరేషన్ (సదా మీకోసం) :
రానున్న వేసవికాలం నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని నగర వ్యాప్తంగా మంచినీటి సరఫరాకు ఏలాంటి అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులకు సూచించారు.
స్థానిక 31 వ డివిజన్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రోడ్డులోని చవటగుంట, విజయలక్ష్మి నగర్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, డోర్ టు డోర్ చెత్త సేకరణ పనులను అధికారులతో కలిసి కమిషనర్ గురువారం పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛ నెల్లూరు సాకారానికి కృషి చేయాలని అధికారులు, సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు.
స్థానికంగా ఉన్న వివిధ వీధుల్లో డ్రైను కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని, దోమల నిర్మూలనకు మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దోమల నివారణా చర్యల్లో భాగంగా అన్ని డ్రైను కాలువల్లో ఆయిల్ బాల్స్ పిచికారీ చేయాలని, క్రమం తప్పకుండా ఫాగింగ్ పనులు నిర్వహించాలని కమిషనర్ సూచించారు.
నగర పాలక సంస్థ అందజేసిన చెత్త బుట్టలలో తడి, పొడి చెత్తను విడిగా తీసి ఉంచాలని, రీ సైక్లింగ్ విధానానికి ప్రజలంతా బాధ్యతగా సహకరించాలని కమిషనర్ కోరారు.
డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో డ్రైను కాలువల్లో పూడికతీత, సిల్ట్ తొలగింపు పనులను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు.
అనంతరం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను సందర్శించిన కమిషనర్ మంచినీటి సరఫరా పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.
చెరువు నీటిని సేకరించిన అనంతరం వివిధ విభాగాలలో జరుగుతున్న మంచినీటి శుద్ధి ప్రాసెసింగ్ విధానాలను కమిషనర్ గమనించారు.
వేసవికాలంలో మంచినీటి సరఫరాలో తలెత్తే అంతరాయలపై ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ సూచించారు.
మంచినీటి పరిశుభ్రతకు ప్రధాన ప్రాధాన్యత కల్పిస్తూ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను సిబ్బంది కచ్చితంగా పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఇంజినీరింగ్ విభాగం అధికారులు సంపత్ కుమార్, సంజయ్, శేషగిరిరావు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.