ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్ ఎప్పుడో తెలుసా?
కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవంతో ఏపీలో పాఠశాలలు పున: ప్రారంభం మరోసారి వాయిదా పడ్డట్టే కనిపిస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగడంతో పాటు మరణాలు సైతం ఎక్కువగానే సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మరోసారి వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు ఆగష్టు3 నుంచి పాఠశాలలన్నీ తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో దీనిపై ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 3 న కాకుండా మరో నెల పాటు వాయిదా వేసింది. వీటిని సెప్టెంబరు 5న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాలల్లో ఇప్పటికే నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి.
వీటికి సంబంధించి అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేసింది. ఈ పనులను నాణ్యతతో చేసేలా ప్రస్తుతం ఉపాధ్యాయులను పర్యవేక్షించేందుకు అప్పగించారు. దాదాపుగా మరో రెండు, మూడు నెలల్లో ఈ పనులన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు పుస్తకాలతో పాటు యూనిఫాంలు, షూ, బ్యాగ్ లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. వీటిని వీలైనంత తొందర్లో సిద్ధం చేయాలని ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారు. అయితే ప్రస్తుతం వాయిదా వేస్తే ఇవన్నీ కలిసి రావచ్చు. పాఠశాలలను ప్రారంభించినరోజే ఇవన్నీ పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ 5నుండి పాఠశాలలు ప్రారంభించేందుకు సర్కార్ సిద్దమవుతుంది. ఈ నెల 15న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాఠశాలలు తిరిగి ఎప్పుడు ప్రారంబిస్తారో తెలపాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు పాఠశాలలు తెరవాలనుకుంటున్న తేదీలను కేంద్రానికి తెలిపాయి. కాగా వాటిలో ఏమైనా మార్పులు ఉన్నాయా..ఉంటే శుక్రవారం వరకు తెలపాలని కోరింది కేంద్రం కోరింది. అయితే మొదట ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభిస్తామని కేంద్రానికి తెలిపిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను ప్రారంభించనున్నామని తెలిపింది. మరోవైపు బీహార్, ఢిల్లీ రాష్ట్రాలు ఆగస్టు లో స్కూళ్లను ప్రారంభిస్తామని తెలపగా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.