ప్రణాళికాబద్ధంగా రొట్టెల పండుగ నిర్వహణ : దర్గా సందర్శనలో మేయర్, కమిషనర్

ప్రణాళికాబద్ధంగా రొట్టెల పండుగ నిర్వహణ
దర్గా సందర్శనలో మేయర్, కమిషనర్
నెల్లూరు కార్పొరేషన్, ఆగష్టు 7 (సదా మీకోసం) :
ప్రజాప్రతినిధుల సహకారం, ప్రభుత్వ విభాగాల సమన్వయంతో అత్యంత ప్రణాళికాబద్ధంగా బారా షహీద్ రొట్టెల పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని, నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా బారా షహీద్ దర్గాలో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ డి. హరిత అధికారులను ఆదేశించారు.
బారా షహీద్ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లను అధికారులతో కలిసి మేయర్, కమిషనర్ లు ఆదివారం పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 వేల మంది సిబ్బందితో మూడు షిఫ్టులలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టనున్నామని తెలిపారు.
మహిళలు, చిన్నారుల రక్షణకోసం బారాషహీద్ దర్గా ప్రాంగణం మొత్తం పటిష్టమైన సిసి కెమెరా నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి అనుక్షణం అధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రాంగణంలో నిర్మించిన మరుగుదొడ్లతో పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న మరుగుదొడ్ల పారిశుద్ధ్య నిర్వహణను ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని సూచించారు.
వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చే వాహనాలకు తగిన పార్కింగ్ సౌకర్యం కల్పించి, పండుగ దినాలలో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రొట్టెల పండుగ జరిగే స్వర్ణాల చెరువు తీరంతో పాటు, దర్గా పరిసర ప్రాంతాలు, రోడ్డు మార్గాల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని వారు సూచించారు.
పండుగ ప్రాంగణంలో వివిధ విభాగాలను సూచించే సూచికలను విస్తృతంగా ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని వారు సూచించారు.
దర్గా ప్రాంగణంలో అవసరమున్న అన్ని విభాగాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మేయర్, కమిషనర్ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువును అత్యంత పరిశుభ్రంగా ఉంచి, నీటిని నిరంతరం శుద్ధి చేస్తూ ఉండాలని అధికారులను వారు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ యాకసిరి వాసంతి, నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు సంజయ్, శేషగిరిరావు, చంద్రయ్య, శానిటరీ సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.